Sircilla: సిరిసిల్లలో బీఆర్ఎస్ ‘కాంగ్రెస్ బాకీ కార్డుల’ పంపిణీ!
Sircilla: సిరిసిల్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇంటింటికీ 'కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ కార్డుల' పంపిణీ. ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని చక్రపాణి డిమాండ్.
Sircilla: సిరిసిల్లలో బీఆర్ఎస్ ‘కాంగ్రెస్ బాకీ కార్డుల’ పంపిణీ!
Sircilla: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ కార్డుల’ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని 3వ వార్డు బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ బాకీ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి మాట్లాడుతూ.. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలను ప్రకటించి, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పిందని అన్నారు. అయితే ప్రభుత్వం 1000 రోజుల పాలన దాటినా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.
రైతులు, చేనేత కార్మికులు, ఆటో కార్మికులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు, యువతతో పాటు వివిధ వర్గాల ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
హామీలను అమలు చేయకపోతే ప్రజల పక్షాన మరిన్ని పోరాటాలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మనుగడ లేకుండా చేస్తామని జిందం చక్రపాణి హెచ్చరించారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని అన్నారు. వార్డుల్లో పర్యటించే సమయంలో పెరిగిన పెన్షన్ ఎప్పుడు వస్తుందని, స్కూటీలు ఎప్పుడు ఇస్తారని, కల్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం ఎప్పుడు ఇస్తారని, మహిళలకు రూ.2,500 ఎప్పుడు ఇస్తారని ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని తెలిపారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ప్రభుత్వం అయినా అమలు చేస్తూ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. నెరవేర్చని హామీలతో ప్రజలను మోసం చేయకూడదని పేర్కొన్నారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ కార్డుల’ పంపిణీ సందర్భంగా పలువురు ప్రజలు కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత వ్యక్తం చేశారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దూస రాజేశం, బండారి శివ, వేముల హరికృష్ణ, మీరు లక్ష్మీనారాయణ, సయ్యద్ షాదాబ్, జిందం అనిల్, దూస ఈశ్వరి, చిలుక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




