Tuni: ఆసుపత్రిని 200 పడకల కేంద్రంగా మారుస్తాం: కలెక్టర్ ఎమ్మెల్యే యనమల

Tuni: తుని ఏరియా ఆసుపత్రికి కెనరా బ్యాంక్ సీఎస్‌ఆర్ (CSR) నిధుల కింద అందించిన రూ. 30 లక్షల విలువైన వైద్య పరికరాలను జిల్లా కలెక్టర్, ప్రభుత్వ విప్ యనమల దివ్య

MANIKANTA, TUNI
Published on: 9 July 2026 7:18 PM IST
Tuni
X

Tuni: ఆసుపత్రిని 200 పడకల కేంద్రంగా మారుస్తాం: కలెక్టర్ ఎమ్మెల్యే యనమల

తుని: ఏరియా ఆసుపత్రికి కెనరా బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన రూ.30 లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను గురువారం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్.. ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే యనమల దివ్య, కెనరా బ్యాంకు డివిజనల్ మేనేజర్ శ్రీకాంత్, అసిస్టెంట్ మేనేజర్ గణేష్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రికి బ్యాటరీ ఆపరేటెడ్ CR కంపాటిబుల్ ఆపరేషన్ టేబుల్, ఆర్థోపెడిక్ డ్రిల్లింగ్ యూనిట్, 360 డిగ్రీల డబుల్ సర్ఫేస్ ఫోటోథెరపీ యూనిట్ (ఇంటిగ్రేటెడ్ రేడియోమీటర్, బేబీ బాస్కెట్‌తో), మేజర్ ఆర్థోపెడిక్ ఇన్‌స్ట్రుమెంట్ సెట్, సర్జికల్ హెడ్‌లైట్ (బ్యాటరీ బ్యాకప్‌తో), CR సిస్టమ్ విత్ ప్రింటర్, 12-చానల్ ECG యంత్రం, సెమీ ఆటోమేటెడ్ బయోకెమిస్ట్రీ అనలైజర్, మసిల్ స్టిమ్యులేటర్, అల్ట్రాసౌండ్ థెరపీ యూనిట్, 70 ప్రోగ్రామ్‌లతో అడ్వాన్స్‌డ్ IFT థెరపీ యూనిట్ వంటి అత్యాధునిక వైద్య పరికరాలను అందజేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ విభాగాన్ని ప్రారంభించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించి, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఆసుపత్రి వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ.ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కెనరా బ్యాంకు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి సుమారు రూ.30 లక్షల విలువైన ఆధునిక వైద్య పరికరాలను అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంకు యాజమాన్యానికి జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

ఈ పరికరాల వల్ల సామాన్య ప్రజలు ఫిజియోథెరపీ వంటి వైద్య సేవలను ఇకపై బయట ప్రైవేట్ ఆసుపత్రులలో ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉచితంగా పొందే అవకాశం కలిగిందని తెలిపారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో ప్రతిరోజూ సుమారు 10 నుండి 15 ప్రసవాలు, 15 నుండి 20 శస్త్రచికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

దీనితో పాటు, ఈ ఆసుపత్రిని 200 పడకల సామర్థ్యం గల కేంద్రంగా మార్చాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే ఐటిహెచ్ (IT&H) ల్యాబ్ మరియు పూర్తిస్థాయి బ్లడ్ బ్యాంక్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాంతంలో వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ.. తుని ఏరియా హాస్పిటల్‌కు కెనరా బ్యాంక్ వారు 30 లక్షల రూపాయల విలువైన వైద్య పరికరాలను విరాళంగా అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ విరాళంతో ఏరియా ఆసుపత్రిలో సుమారు 12 రకాల అత్యాధునిక ఎక్విప్‌మెంట్‌లను హాస్పిటల్‌కు సమకూర్చాడం జరిగిందన్నారు.

ముఖ్యంగా, గతంలో అందుబాటులో లేని ఫిజియోథెరపీ సదుపాయాన్ని ఇప్పుడు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల, ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడే పేషెంట్లను ఇతర ప్రాంతాలకు పంపాల్సిన అవసరం లేకుండా, స్థానికంగానే చికిత్స అందించే అవకాశం ఏర్పడిందని తుని ఎమ్మెల్యే యనమల దివ్య పేర్కొన్నారు.

ఈ వైద్య పరికరాలతో పాటు పాతబడిన ఎక్స్-రే మెషిన్‌లను తొలగించి, లేటెస్ట్ వెర్షన్ మెషిన్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. తుని ఏరియా హాస్పిటల్‌ను 200 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు జిల్లా కలెక్టర్‌తో కలిసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని, తుని నియోజకవర్గంలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ‌భవిష్యత్తులను కొనసాగుతాయని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

కార్యక్రమంలో జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి డా. కె.మహేశ్వరరావు, ఆర్‌.ఎం.ఓ డా. సత్యనారాయణ, బయోమెడికల్ ఇంజనీర్ వెంకటరాజా, వైద్యులు, నర్సింగ్ అధికారులు, ఆసుపత్రి సిబ్బంది, కెనరా బ్యాంకు ప్రతినిధులు, తుని పట్టణ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI

Next Story