Sircilla: కాంగ్రెస్ నిరసన ఉద్రిక్తత: కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం!
Sircilla: అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నిరసన ఉద్రిక్తత. ఎమ్మెల్సీ తాతా మధు బర్తరఫ్‌కు డిమాండ్ చేస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం, పోలీసులతో తోపులాట.
Sircilla: కాంగ్రెస్ నిరసన ఉద్రిక్తత: కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం!
Sircilla: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.
ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దహనం చేశారు. దిష్టిబొమ్మ దహనం సమయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ కిందపడిపోయారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు లాఠీలు చేతబట్టి అక్కడికి రావడంతో కాంగ్రెస్ శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవరాజు గల్లా పట్టుకుని ఓ కానిస్టేబుల్ వ్యవహరించారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
ఎమ్మెల్సీ తాతా మధుపై చర్యలు తీసుకుని బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరసన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.




