Peddapalli: బడిలో పాత జ్ఞాపకాల పందిరి.. పూర్వ విద్యార్థుల సందడి

Peddapalli: పెద్దపల్లి జిల్లా పెగడపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల 2006-07 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.

Srimanthula Kondal, Peddapalli
Published on: 27 April 2026 6:16 PM IST
Peddapalli
X

Peddapalli: బడిలో పాత జ్ఞాపకాల పందిరి.. పూర్వ విద్యార్థుల సందడి

Peddapalli: పాత జ్ఞాపకాలు చిగురించాయి.. చిన్ననాటి నేస్తాలు ఒకటయ్యారు.. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ చదువుకున్న పాఠశాల ప్రాంగణంలో సందడి చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-07 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది.

దాదాపు 17 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి చేరిన విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను మరువలేదు. తాము ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారిని శాలువాలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. విద్యార్థులంతా ఉపాధ్యాయుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం అక్కడి వారిని కదిలించింది.

ఈ సందర్భంగా విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. వృత్తిరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ, స్నేహం కోసం అందరూ ఒకే చోట కలవడం సంతోషంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాల రోజుల్లో జరిగిన అల్లరి, ఆటపాటలను గుర్తు చేసుకుంటూ వేదికపై సరదాగా గడిపారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

తమను గుర్తుంచుకుని, ఇంతటి గౌరవాన్ని అందించినందుకు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 2006-07 బ్యాచ్ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు మరియు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story