Karimnagar: కరీంనగర్‌లో ఏఐటీయూసీ 4వ రాష్ట్ర మహాసభలు ప్రారంభం
Karimnagar: కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశం సంక్షోభంలో పడిందని ఏఐటీయూసీ జాతీయ నేత అమర్‌జీత్ కౌర్ ఆరోపణ. కరీంనగర్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభల ప్రారంభం.
Karimnagar: కరీంనగర్‌లో ఏఐటీయూసీ 4వ రాష్ట్ర మహాసభలు ప్రారంభం
కరీంనగర్ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశం తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడుతుందని ఏఐటీయూసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ జీత్ కౌర్ ఆరోపించారు. దేశంలో రోజురోజుకూ వ్యవసాయ సంక్షోభం తీవ్రమవుతోందని, నిరుద్యోగం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అమరజీవి మాదన నారాయణ స్మారక ప్రాంగణం లో ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభల ప్రారంభ సూచికగా ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ జెండాను జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ జీత్ కౌర్ ఎగురవేశారు. అమరవీరుల స్మారక స్తూపాన్ని మహాసభల చీఫ్ ప్యాట్రన్,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన ప్రతినిధుల సభకు ఏఐటీయూసి రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ యూసుప్ అధ్యక్షత వహించగా, స్వాగతోపన్యాసం ఆహ్వాన సంఘం అధ్యక్షుడు,సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కార్మిక ఉద్యమ చరిత్ర, జిల్లా భౌగోళిక పరిస్థితులు, జిల్లాలో కార్మిక సంఘాల నిర్మాణం,కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు,కేంద్ర,రాష్ట్ర పాలకులు కార్మిక విధానాలు, భవిష్యత్తులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్మించబోయే కార్మిక ఉద్యమాలకు ఈ మహాసభ దిక్సూచిగా నిలవాలని,33 జిల్లాల ప్రతినిధులు బలమైన ప్రతిజ్ఞ బూని పోరాటాలకు సమరశంఖం పూరించాలని, మహాసభ నిర్వహించేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పంజాల శ్రీనివాస్ పేర్కొన్నారు.
మహాసభల ప్రారంభానికి ముఖ్యఅతిధి విచ్చేసిన జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ జీత్ కౌర్ మాట్లాడుతూ మోదీ పాలనలో లక్షకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని, ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు నిధులు కోత విధించారని ఆరోపించారు. కార్పొరేట్లకు, విదేశీ విశ్వవిద్యాలయాలకు ఉచిత భూములు ఇస్తూ, వారు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారని అన్నారు. దీనివల్ల సాధారణ, పేద కుటుంబాల పిల్లలు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రశ్నించే తత్వాన్ని అణచివేయడానికే విద్యావంతులను అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేస్తున్నారని విమర్శించారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో దేశ సహజ వనరుల ఆధారంగా పరిశ్రమలు స్థాపించి, పేదరికాన్ని,నిరుద్యోగాన్ని నిర్మూలించాలని భావించగా, ప్రస్తుత ప్రభుత్వం జాతీయ ఆస్తులను అంబానీ, అదానీ వంటి బడా కార్పొరేట్లకు, విదేశీ కంపెనీలకు కట్టబెడుతోందని మండిపడ్డారు.
దేశంలోని కార్మికులలో మెజారిటీ కార్మికులు అసంఘటిత రంగంలోనే ఉన్నారని, వారికి కనీస వేతనాలు, సామాజిక భద్రత, పెన్షన్ సౌకర్యాలు లేవని తెలిపారు. ఆర్టీసీ వంటి రంగాల్లో ఉద్యోగులు 12 నుండి 14 గంటలు పనిచేస్తున్నా కష్టాలు తీరడం లేదని, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ వ్యవస్థల వల్ల భద్రత కరువైందని పేర్కొన్నారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్‌లతో కార్మిక హక్కులను కాలరాసి, ట్రేడ్ యూనియన్లను అణచివేసేందుకు కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు నిరసనగా నోయిడా, మనేసర్, గుర్గావ్ వంటి ప్రాంతాల్లో వీధిలోకి వచ్చిన కార్మికులపై కేసులు బనాయించి జైలుకు పంపడాన్ని ఏఐటీయూసీ తీవ్రంగా ఖండించిందని,కార్మికులందరూ ఏకమై తమ హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలని అమర్ జిత్ కౌర్ పిలుపునిచ్చారు. మోడీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం. మహసభల చీఫ్ ప్యాట్రన్ చాడ వెంకటరెడ్డి.
మహసభల చీఫ్ ప్యాట్రన్ చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి మూడుసార్లు అధికారంలోకి వచ్చిందని,కార్మిక వర్గాన్ని శ్రమ దోపిడీకి గురి చేసేందుకు అనేక కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తుందని, ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేయడానికి కార్పొరేటు దిగ్గజాలతో చేతులు కలుపుతున్న మోడీ ప్రభుత్వ విధానాలను వామపక్షాలు కార్మిక వర్గాలు చూస్తూ ఊరుకో బోవని హెచ్చరించారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ మార్పు కోసం బద్లావ్ జరూరి హై అనే నినాదంతో ఇటీవల ఢిల్లీలో సిపిఐ పెద్ద ఎత్తున సభ నిర్వహించిందని,శ్రమను నమ్ముకొని జీవిస్తున్న కార్మిక వర్గానికి కల్పతరంగా నిలిచేందుకు ఏఐటియూసి నాయకత్వం పనిచేయాలని, 106 సంవత్సరాలుగా అవిశ్రాంత,అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తున్న నాయకత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాని భవిష్యత్ లో కార్మిక వర్గానికి అండగా ఉంటామని వెంకటరెడ్డి తెలిపారు.
మహాసభకు సౌహర్ధ సందేశాలు ఇవ్వడానికి విచ్చేసిన ప్రపంచ కార్మిక సంఘాల ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ సి.శ్రీకుమార్,ఏ.ఐ.టీ.యూ.సీ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి, వెంకట సుబ్బయ్య,వామపక్ష కార్మిక సంఘాలు సి.ఐ.టి.యు, హెచ్.ఎం.ఎస్ మరియు టి.యు.సి.ఐ.రాష్ట్ర కార్యదర్శులు పాలడుగు భాస్కర్, ఉపేందర్,సూర్యం, మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను పూర్తిగా కాలరాసే విధంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు.
గతంలో రైతులు చేసిన పోరాటాలకు తలగ్గిన మోడీ వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. అదేవిధంగా విద్యార్థులు ఇటీవల జంతర్ మంతర్ వద్ద చేసిన నిరసనలకు దిగివచ్చిన కేంద్రం కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసి వాళ్ళ డిమాండ్స్ ను అంగీకరించే పరిస్థితి వచ్చింది.
కార్మికులకు సంబంధించిన చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్ ల పేరుతో తీసుకొస్తే కార్మికులు ఏకతాటిపైకి వచ్చి అందరం ఒక్కటై పోరాడాల్సిన అవసరం ఉందని నాయకులు ముక్తకంఠంతో పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్లను తిప్పి కొట్టాలంటే ఐక్య పోరాటాలతోనే సాధ్యమవుతుందని అందుకు కార్మిక సంఘాలన్నీ ఏకం అవ్వాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.
ఈ మహాసభలలో ఆహ్వాన సంఘం ప్యాట్రన్ కలవేన శంకర్, ఏఐటీయూసీ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు వి. ఎస్. బోస్,గౌరవాధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య,డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎం.నర్సింహా,ఉపాధ్యక్షులు కె.యేసురత్నం, బి.చంద్రయ్య, పి.ప్రేమ్ పావని, రాష్ట్ర కార్యదర్శులు ఎన్.కరుణ కుమారి,ఎస్.విలాస్.సింగు నర్సింహ రావు,బి.వెంకటేష్,పల్లా దేవేందర్ రెడ్డి,టేకుమల్ల సమ్మయ్య, వై. ఒమయ్య, నారాటి ప్రసాద్,మేకల శ్రీనివాస్ రావు,ఓరుగంటి యాదయ్య, ఏం.డి.ఇమ్రాన్,సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




