Tuni: తుని ఏరియా ఆసుపత్రిలో అధునాతన ఐపీహెచ్‌ఎల్‌ ల్యాబ్‌ ప్రారంభం

Tuni: తుని ఏరియా ఆసుపత్రిలో రూ.1.25 కోట్లతో అధునాతన ఐపీహెచ్‌ఎల్‌ ల్యాబ్ ప్రారంభం. పేదలకు ఉచితంగా 130 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి.

MANIKANTA, TUNI
Published on: 12 Sept 2026 4:06 PM IST
Tuni
X

Tuni: తుని ఏరియా ఆసుపత్రిలో అధునాతన ఐపీహెచ్‌ఎల్‌ ల్యాబ్‌ ప్రారంభం

తుని: కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో ప్రజారోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కోట్లాది రూపాయలతో సరికొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌ల (ఐపీహెచ్‌ఎల్) ప్రారంభోత్సవంలో భాగంగా.. తుని ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన అధునాతన ల్యాబ్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శనివారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం ఏబీహెచ్‌ఐఎం) నిధులతో దాదాపు రూ.1.25 కోట్ల వ్యయంతో ఈ సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, స్థానిక శాసనసభ్యురాలు, రాష్ట్ర ప్రభుత్వ విప్ యనమల దివ్య తదితరులు ఈ వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పేదలకు ఉచితంగా 130 రకాల వైద్య పరీక్షలు

ఈ సందర్భంగా తుని ఆసుపత్రి నుంచి వర్చువల్‌గా మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ.. గతంలో వైద్య పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించి కాకినాడ, విశాఖపట్నం లేదా విజయవాడకు పంపించాల్సి వచ్చేదని, ఇకపై ఆ శ్రమ తప్పి తునిలోనే అన్ని రకాల పరీక్షలు స్థానికంగానే అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ అడ్వాన్స్‌డ్ ల్యాబ్ ద్వారా సాధారణ పరీక్షలతో పాటు దాదాపు 130 రకాల కొత్త మరియు అధునాతన పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. క్యాన్సర్‌తో పాటు థైరాయిడ్, హార్మోన్ అసమతుల్యత (హార్మోన్ ఇంబ్యాలెన్స్) సంబంధిత ప్రాణాంతక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి నిర్ధారించేందుకు ఈ ల్యాబ్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. త్వరలోనే జిల్లాలో ‘సంజీవని’ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి, పేదల ఇంటి వద్దకే స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

కూటమి ప్రభుత్వ ధ్యేయం పేదలకు మేలైన వైద్యమే: ఎమ్మెల్యే యనమల దివ్య

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమైన "హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఆంధ్రప్రదేశ్" సాధనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తుని శాసనసభ్యురాలు యనమల దివ్య స్పష్టం చేశారు. తుని ఆసుపత్రిలో ఇప్పటివరకు దాదాపు 100 బేసిక్ పరీక్షలు జరుగుతుండగా.. ఈ ఐపీహెచ్‌ఎల్‌ ల్యాబ్ ద్వారా అదనంగా మరో 34 అత్యంత కీలకమైన పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి అసెంబ్లీ సమావేశాల నుంచే థైరాయిడ్ పరీక్షల ఆవశ్యకతపై తాను గళం విప్పానని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ కేంద్రాన్ని సాధించుకున్నామని ఆమె తెలిపారు. శాంపిల్స్‌ను ఎక్కడికీ బయటకు పంపకుండా క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, క్రిటికల్ కల్చర్ పరీక్షల రిపోర్టులను ఇక్కడే త్వరితగతిన అందజేస్తామన్నారు.

అలాగే, తుని పురాతన ఆసుపత్రి భవన రినోవేషన్ కోసం జిల్లా కలెక్టర్‌ను కోరగా.. ఆయన తక్షణ స్పందించి హెచ్‌డిఎస్ నిధుల ద్వారా రూ.2.3 కోట్లు మంజూరు చేశారని దివ్య వెల్లడించారు. ఈ నిధులతో మొదటి అంతస్తులోని బ్లడ్ బ్యాంక్ పునర్నిర్మాణం, ఆపరేషన్ థియేటర్‌తో కూడిన ప్రత్యేక కంటి వైద్య (ఆప్తమాలజీ) విభాగం ఏర్పాటు, 5 వార్డుల ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే మార్చి నాటికి ఇవన్నీ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి.సి.హెచ్.ఎస్. డాక్టర్ మహేశ్వర రావు, ఏపీఎంఐడీసీ ఈఈ రత్నరాజు, డీఈ శ్రీనివాస చక్రవర్తి, జీజీహెచ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI