Gandepalli: తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

Gandepalli: కాకినాడ జిల్లా తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. సెప్టెంబర్ చివరి నాటికి రూ.52 కోట్ల ప్రాజెక్ట్ పనులు పూర్తి.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 22 Aug 2026 4:38 PM IST
Gandepalli
X

Gandepalli: తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

గండేపల్లి: కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు వద్ద 31 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 52 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న ఈ పనులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శనివారం నాలుగోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాళ్లూరు లిఫ్ట్ కు శంకుస్థాపన చేసి నిధులు మంజూరు చేశారని, అయితే గత ఏడు సంవత్సరాలుగా సిమెంట్ పైపులు పాడవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 52 కోట్ల నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించామని, దీనిపై కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

వర్షాల కారణంగా పనులకు ఆటంకం కలుగుతోందని, ఒక్కరోజు వర్షం కురిస్తే నాలుగు రోజుల పాటు పనులు నిలిచిపోతున్నాయని తెలిపారు. అయినప్పటికీ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని, జిందాల్ కంపెనీ ఐరన్ పైపులకు మెష్ ఏర్పాటు చేసి హై ప్రెజర్ సిమెంట్ కోటింగుతో పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు.

కొందరు పనుల పరిశీలన పేరుతో వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, గతంలో లిఫ్ట్ పని చేయనప్పుడు వారు ఏం చేశారని ప్రశ్నించారు. తాను రైతు పక్షపాతిగా ఈ ప్రాంతానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నానని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ నియోజకవర్గానికి నాలుగు ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకువచ్చారని, తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఆ ప్రాజెక్టులను సాధించానని, గతంలో పని చేసిన వారు ఒక్క సాగునీటి ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు.

తాళ్లూరు లిఫ్ట్ పనులు ఆపి మామిడాడ జ్యోతుల పాపారావు సాగునీటి పథకం పనులు చేయిస్తున్నారని కొందరు రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. మామిడాడ పథకం 3500 ఎకరాల ఆయకట్టుకు, నాలుగు గ్రామాలకు నీరు అందించేందుకు 3 కోట్ల 82 లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధులతో పూర్తి చేశామని, ఆ పథకం కింద గానీ, ఈ నాలుగు సాగునీటి ప్రాజెక్టుల కింద గానీ తనకు ఒక్క ఎకరా భూమి కూడా లేదని, తన భూమికి తాను సొంతంగా బోర్లు వేయించుకుని సాగు చేసుకుంటున్నానని స్పష్టం చేశారు.

వాతావరణం అనుకూలిస్తే, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సెప్టెంబర్ నెల చివరి నాటికి పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పైడిపాల సూరిబాబు, పిల్లా చంటిబాబు, రేఖ బుల్లిరాజు, జాస్తి వసంత్, ఉప్పలపాటి బుల్లెబ్బాయ్, దాసరి సీతారామకృష్ణ, పురంశెట్టి శివాజీ, సుంకవిల్లి రాజు, యర్రంశెట్టి బాబ్జి, కురుకూరి వీర వెంకట చౌదరి, శిలామంతుల వీరబాబు, పి. వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ అధికారులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA

Next Story