Pithapuram: పిఠాపురంలో సైకిల్ తొక్కి ఆరోగ్యంపై అవగాహన కల్పించిన సీఐ శ్రీనివాస్

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పోలీసులు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

RAMA KRISHNA, KKD
Published on: 14 Jun 2026 11:57 AM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురంలో సైకిల్ తొక్కి ఆరోగ్యంపై అవగాహన కల్పించిన సీఐ శ్రీనివాస్

పిఠాపురం: కాకినాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి. బిందు మాధవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారి పాటిల్ దేవరాజ్ మానిష్, ఐపీఎస్ సూచనల ప్రకారం, ఫిట్ ఇండియా కార్యక్రమంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది.

ఈ సైకిల్ ర్యాలీ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమై పాదగయ, రథాలపేట, ఉప్పాడ సెంటర్, చర్చి సెంటర్, ఇంద్రానగర్, స్టువర్టుపేట సెంటర్ మీదుగా కొనసాగి తిరిగి పాదగయ సెంటర్ వద్ద ముగిసింది. ఈ ర్యాలీలో పిఠాపురం సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది మరియు ఈగల్ టీమ్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, రోజువారీ జీవితంలో వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సైకిల్ తొక్కడం ద్వారా శరీరానికి సమగ్ర వ్యాయామం లభించడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు. అలాగే సైక్లింగ్ శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించి, యువత చెడు అలవాట్లు, మాదకద్రవ్యాల వ్యసనాలకు దూరంగా ఉండేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

ర్యాలీ సందర్భంగా ఉప్పాడ సెంటర్ వద్ద పోలీస్ సిబ్బందితో ఫిజికల్ ఎక్సర్సైజ్ కార్యక్రమం నిర్వహించి, ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ, వ్యాయామం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొని పోలీసుల ప్రయత్నాలను అభినందించారు.

ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు "డ్రగ్స్ వద్దు బ్రో.. సైకిల్ తొక్కు బ్రో", "సైకిల్ తొక్కండి - కాలుష్యాన్ని నివారించండి", "ఆరోగ్యమే మహాభాగ్యం" వంటి నినాదాలతో అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సైక్లింగ్ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో పిఠాపురం రూరల్ ఎస్‌ఐ జాన్ బాషా, పిఠాపురం టౌన్ ఎస్‌ఐ లోకేష్, సర్కిల్ పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ల సిబ్బంది, ఈగల్ టీమ్ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD

Next Story