Peddapuram: అర్జీలను పకడ్బందీగా పరిష్కరించాలి – కలెక్టర్ హరేంధిర
Peddapuram: పెద్దాపురంలో 'ఒక నెల - ఒక గ్రామం' కార్యక్రమంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ 52 అర్జీలు స్వీకరించారు. సమస్యలను పకడ్బందీగా పరిష్కరించాలని ఆదేశించారు.
Peddapuram: అర్జీలను పకడ్బందీగా పరిష్కరించాలి – కలెక్టర్ హరేంధిర
పెద్దాపురం: ఒక నెల -ఒక గ్రామం నాలుగు సందర్శనలు కార్యక్రమం కింద అందిన అర్జీలను అత్యంత పగడ్బందీగా, ప్రత్యేక దృష్టితో పరిష్కారంచాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు.శనివారం పెద్దాపురం నియోజకవర్గం స్థాయిలో పెద్దాపురం మండలం ఎంపీడీవో నిర్వహించిన 'ఒక నెల - ఒక గ్రామం - నాలుగు సందర్శనలు' కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్.. ట్రైనీ కలెక్టర్ ప్రియ ఇతర అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు, అర్జీలను స్వయంగా స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. తొలుత భారత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి నెలా ఒక నియోజకవర్గం చొప్పున నాలుగు సార్లు శుక్రవారం ఆ నియోజకవర్గంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా పెద్దాపురం నియోజకవర్గ స్థాయిలో ఒక నెల -ఒక గ్రామం నాలుగు సందర్శనలు కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం కింద అందిన అర్జీల పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అత్యంత పకడ్బందీగా పరిష్కరించాలన్నారు.వివిధ శాఖలను నమోదు అయిన అర్జీలను క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రజా సమస్యలకు పూర్తి పరిష్కారం చూపేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ వారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో దాదాపు 52 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ఇవన్నీ కూడా ప్రధానంగా భూవివాదాలు, రీసర్వేలో గతంలో జరిగిన సమస్యలు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, రోడ్లు, తాగు నీరు, వ్యవసాయం అంశాలపై వచ్చాయన్నారు. వీటిని అన్నిటిపై అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి, అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు తెలుసుకొని ప్రజలు సంతృప్తి చెందేలా వారి సమస్యను పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మాజీ చైర్ పర్సన్ రాజా సూరిబాబు రాజా, పెద్దాపురం ఎంపీడీవో కెవీ. సూర్యనారాయణ, తహసీల్దార్ పి. శ్రీనివాసు, నియోజకవర్గంలోని ఇతర మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, డివిజన్,మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.




