Tuni: తునిలో ముగిసిన ప్రాణభయం.. కూల్చివేసిన ప్రమాదకర పురాతన గోడ, రావి చెట్టు
Tuni: తునిలోని దివానపు వీధిలో ప్రమాదకరంగా మారిన పురాతన గోడ, రావి చెట్టును ఆర్డీవో ఆదేశాలతో తొలగించారు.
Tuni: తునిలో ముగిసిన ప్రాణభయం.. కూల్చివేసిన ప్రమాదకర పురాతన గోడ, రావి చెట్టు
తుని (కాకినాడ జిల్లా): తుని పట్టణంలోని దివానపు వీధి (గౌరీదేవి గుడి వీధి) లో ప్రజలకు, విద్యార్థులకు నెల రోజులుగా సింహస్వప్నంగా మారిన ప్రమాదకరమైన పురాతన గోడ మరియు పెద్ద రావి చెట్టు ఎట్టకేలకు తొలగింపునకు నోచుకున్నాయి.
ఈ వీధిలో రద్దీగా ఉండే ప్రాంతంలో కూలేందుకు సిద్ధంగా ఉన్న గోడ మరియు దానిని ఆనుకుని భారీగా పెరిగిన రావి చెట్టు వల్ల ఎప్పుడైన పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందంటూ గతంలో HMTV లో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. దీనిపై స్థానికులు మున్సిపల్ అధికారులను ఆశ్రయించినప్పటికీ, సరైన స్పందన కరువైంది.
సమస్య తీవ్రతను గుర్తించిన స్థానికులు మరియు బాధితులు ఈ విషయాన్ని పెద్దాపురం ఆర్.డి.ఓ. పి. కృష్ణమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఆర్.డి.ఓ. గారు అధికారులను అప్రమత్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి, జెసిబి (JCB) సహాయంతో ఆపద కలిగించేలా ఉన్న రావి చెట్టును, శిథిలావస్థకు చేరిన పురాతన గోడను పూర్తిగా తొలగించారు.
సకాలంలో ఆర్.డి.ఓ. పి. కృష్ణమూర్తి చొరవ తీసుకొని చర్యలు తీసుకోవడంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే విద్యార్థులు, భక్తులు, స్థానిక ప్రజలతో పాటు అటువైపుగా నడిచే పాదచారులు, వాహన చోదకులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణభయం తొలగిపోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.




