Amalapuram: గల్ఫ్ నరకం నుంచి విముక్తి కలెక్టర్ చొరవతో కోనసీమ బిడ్డలు సేఫ్

Amalapuram: గల్ఫ్ దేశాల్లో అనారోగ్యం, ఏజెంట్ల మోసంతో ఇబ్బందులు పడ్డ కోనసీమ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్

PRABHU, RAZOLE
Published on: 12 May 2026 5:56 PM IST
Amalapuram
X

Amalapuram: గల్ఫ్ నరకం నుంచి విముక్తి కలెక్టర్ చొరవతో కోనసీమ బిడ్డలు సేఫ్

అమలాపురం: దుబాయ్ మరియు మస్కట్ దేశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న డాక్టర్..బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు గ్రామానికి చెందిన కే.ఆదిలక్ష్మి, అలాగే అమలాపురం మండలం సవరపాలెం గ్రామానికి చెందిన ఎం. మావుళ్ళు మరియు కే.శివకృష్ణలను జిల్లా కలెక్టర్ చొరవతో సురక్షితంగా స్వదేశానికి రప్పించడం జరిగింది. విదేశాల్లో ఎదురైన కష్టాలను అధిగమించి తిరిగి కుటుంబ సభ్యులతో కలుసుకోవడంతో వారి కుటుంబాల్లో ఆనందం నెలకొంది.

కే.ఆదిలక్ష్మి ఉపాధి కోసం 2025 సెప్టెంబర్ నెలలో మస్కట్ దేశానికి వెళ్లి ఒక ఇంటిలో గృహ సహాయకురాలిగా పనిచేయడం ప్రారంభించారు. కొంతకాలం పనిచేసిన తరువాత ఆమెకు తీవ్ర అనారోగ్య సమస్యలు రావడంతో పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. స్థానికంగా ఆసుపత్రిలో చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఇంటి యజమాని ఆమెను అక్కడి ఆఫీసుకు తిరిగి అప్పగించారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు అమలాపురం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను సంప్రదించగా, సంబంధిత ఏజెంట్‌తో సమన్వయం జరిపి ఆమెను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడంలో కేసీఎం కీలక పాత్ర పోషించింది.

ఇదే సమయంలో అధిక అప్పుల భారంతో ఉపాధి కోసం జూన్ 2025 న విజిట్ వీసాతో దుబాయ్ వెళ్లిన ఎం. మావుళ్ళు మరియు కె . శివకృష్ణ అక్కడకు వెళ్ళాక తీవ్ర మోసానికి గురయ్యారు. సరైన ఉద్యోగం కల్పిస్తామని చెప్పిన ఏజెంట్లు వారిని ఎడారి ప్రాంతాల్లో కఠినమైన పనులకు పెట్టి, భారీ యంత్రాలు మోయించడం, బరువైన శారీరక శ్రమ చేయించడం వంటి పరిస్థితుల్లో పని చేయించారు.

సరైన ఆహారం, నిద్ర, నివాస సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని, ఆరోగ్య పరిస్థితి కూడా దెబ్బతిని పనిచేయలేని స్థితి రావడంతో ఆహారం కొనడానికి కూడా డబ్బులు లేక తీవ్ర భయాందోళనలకు గురై తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వెంటనే కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను సంప్రదించగా, అధికారులు సంబంధిత ఏజెంట్లతో సమన్వయం చేసి అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసి వారిని స్వదేశానికి తీసుకురావడం జరిగిందని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ నోడల్ అధికారి వి. సుబ్బారావు సమన్వయకర్త గోళ్ళ రమేష్ తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ మాట్లాడుతూ... విదేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి పొందిన రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారానే వెళ్లాలని ప్రజలకు సూచించారు. విదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ వెంటనే కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను సంప్రదిస్తే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వ సమన్వయంతో ముగ్గురు బాధితులు సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడం వారి కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని నింపింది అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమం లో కడియాల సత్తిబాబు, షేక్ బీబి సఫియా తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story