Rayachoti: చెయ్యేరు నదిలో అక్రమ ఇసుక దోపిడీ!

Rayachoti: రాయచోటిలో చెయ్యేరు నదిలో అక్రమ ఇసుక దోపిడీపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి తదితరులు పరిశీలించారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 30 July 2026 9:49 AM IST
Rayachoti
X

Rayachoti: చెయ్యేరు నదిలో అక్రమ ఇసుక దోపిడీ!

Rayachoti: చెయ్యేరు నదిలో సాగుతున్న అక్రమ ఇసుక దోపిడీ రైతుల జీవనాధారానికే ముప్పుగా మారిందని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ బుడుగుంటపల్లె–రోళ్లమడుగు - బాలరాచపల్లె సరిహద్దుల్లో కొనసాగుతున్న ఇసుక రీచ్‌ను బుధవారం అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, రమేష్ కుమార్ రెడ్డి తదితర వైఎస్ఆర్ సీపీ నేతలు పరిశీలించారు. నదిలో భారీగా తవ్విన గుంతలను ప్రత్యక్షంగా పరిశీలించి స్థానిక రైతులు, గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, అక్రమ ఇసుక తవ్వకాలతో వ్యవసాయ బోర్ల ఫిల్టర్లను ధ్వంసం చేశారని, గతంలో సురక్షితంగా ఉన్న నది ఇప్పుడు ప్రాణాంతకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ గుంతల్లో పడి ఇప్పటికే ఇద్దరు మృతి చెందినా అధికార యంత్రాంగం స్పందించలేదని ఆరోపించారు.రాత్రింబవళ్లు టిప్పర్లతో యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారని, నది మధ్యలో రాళ్లతో రహదారులు నిర్మించారని, టిప్పర్ల రాకపోకలతో గ్రామాల్లో ప్రజలకు రాత్రిపూట నిద్ర కూడా కరువైందని తెలిపారు.

సుమారు 30 అడుగుల లోతులో గుంతలు తవ్వడం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయని, సాగునీరు, తాగునీటి సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయని వాపోయారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ను మాయం చేసి రూ 200 కోట్ల నుంచి రూ 300 కోట్ల మేర దోపిడీ జరిగిందన్నారు. అధికార పార్టీ అండదండలతో జరుగుతున్న అక్రమ ఇసుక దోపిడీని వెంటనే అరికట్టి తమను ఆదుకోవాలని నేతలను కోరారు.

రైతుల సమస్యలను విన్న వైఎస్ఆర్‌సీపీ నేతలు అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా పోరాడతామని స్పష్టం చేశారు. రైతుల హక్కులు, ప్రకృతి సంపద పరిరక్షణ కోసం అన్ని స్థాయిల్లో ఉద్యమిస్తామని, అక్రమ ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story