Mydukur: జనాభా నియంత్రణ కంటే మానవ వనరుల అభివృద్ధే ముఖ్యం!
Mydukur: దువ్వూరు, చింతకుంట పీహెచ్సీల ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీ. దేశంలో సంతానోత్పత్తి రేటు 1.9కి తగ్గిందన్న డాక్టర్ సురేష్ బాబు.
Mydukur: జనాభా నియంత్రణ కంటే మానవ వనరుల అభివృద్ధే ముఖ్యం!
Mydukur: దేశంలో జనాభా నియంత్రణ కంటే మానవ వనరుల అభివృద్ధిపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని దువ్వూరు, చింతకుంట వైద్యాధికారులు పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం దువ్వూరు, చింతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) ఆధ్వర్యంలో విస్తృత అవగాహన ర్యాలీలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్యాధికారులు డాక్టర్ సురేష్ బాబు, డాక్టర్ హేమలత, డాక్టర్ వికసిత, డాక్టర్ రోషిని మాట్లాడుతూ.. భారతదేశ జనాభా 146 కోట్లకు చేరుకున్నప్పటికీ, సంతానోత్పత్తి రేటు (ఫెర్టిలిటీ రేట్) ప్రస్తుతం 1.9కు తగ్గిందని వెల్లడించారు. జనాభా స్థిరత్వానికి అవసరమైన 2.1 ప్రమాణం కంటే ఇది తక్కువగా ఉందని, కాబట్టి ఇకపై జనాభాను తగ్గించడం కంటే యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్ది, వారి సామర్థ్యాన్ని దేశాభివృద్ధికి వినియోగించుకోవడం అత్యంత ఆవశ్యకమని వివరించారు.
జనాభా నియంత్రణ అంటే కేవలం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మాత్రమే కాదని వైద్యాధికారులు స్పష్టం చేశారు. బాలికల విద్య, మహిళల భద్రత, తల్లి–శిశు ఆరోగ్యం, పోషకాహారం అందించడం, నాణ్యమైన వైద్య సేవలు, ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలు సమగ్ర అభివృద్ధికి కీలకమని వారు పేర్కొన్నారు. అదుపు లేని జనాభా పెరుగుదల వల్ల సహజ వనరులపై ఒత్తిడి పెరిగి సామాజిక, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ‘చిన్న కుటుంబం – ఆరోగ్యకరమైన సమాజం’ అనే సందేశాన్ని ఆచరణలో పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ అవగాహన ర్యాలీలో ఆప్తాలమిక్ ఆఫీసర్ చంద్రమౌళి, ఆరోగ్య విస్తరణ అధికారి రాజగోపాల్, ఆరోగ్య పర్యవేక్షకులు వీరాంజనేయులు, శివ గంగరాజు, ఆరోగ్య సహాయకుడు రవికుమార్, సీహెచ్ఓలు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




