Badvel: లంకమల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాల కలకలం!

Badvel: కడప జిల్లా బద్వేలు పరిధిలోని లంకమల అభయారణ్యంలో గుప్త నిధుల తవ్వకాలు జరుపుతున్న ముగ్గురిని అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

B. ARUN KUMAR, BADVEL
Published on: 28 Aug 2026 3:38 PM IST
Badvel
X

Badvel: లంకమల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాల కలకలం!

Badvel: లంకమల అభయారణ్యంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్తచెరువు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం కొందరు వ్యక్తులు తవ్వకాలు చేస్తున్నారన్న సమాచారం అటవీ అధికారులకు అందింది.

సమాచారం మేరకు బద్వేలు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఐ.కె.ఎం. నయీమ్ అలీ ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద ఉన్న వాహనాలను, తవ్వకాలకు ఉపయోగించిన సామగ్రిని అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనలో మూడు ద్విచక్ర వాహనాలు, ఒక ఎటియోస్ కారు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో AP40 LN 8655 స్ప్లెండర్ ప్లస్, KA53 HR 9233 పల్సర్, AP04 AK 6457 పల్సర్, AP40 HC 4094 ఎటియోస్ కారు (తెలుపు రంగు) ఉన్నాయి.

అదేవిధంగా తవ్వకాలకు ఉపయోగించిన గొడ్డళ్లు, పారలు, ఇతర పనిముట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతంలో అక్రమంగా ప్రవేశించి గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ తవ్వకాల వెనుక మరెవరైనా ఉన్నారా? గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఇలాంటి తవ్వకాలు జరిగాయా? అనే కోణాల్లో అధికారులు విచారణ చేపడుతున్నారు. లంకమల అభయారణ్యంలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అటవీ అధికారులు హెచ్చరించారు.

ఈ దాడుల్లో బద్వేలు ఎఫ్‌ఆర్‌ఓ ఐ.కె.ఎం. నయీమ్ అలీ, డిప్యూటీ రేంజ్ అధికారి సి.హెచ్. పెద్దయ్య, ఎఫ్‌బీఓ ఏ. సుబ్బారెడ్డి, ఎఫ్‌బీఓ పి. రాజశేఖర్ రెడ్డి, ఎఫ్‌బీఓ పి. బాలచెన్నయ్యతో పాటు అటవీ రక్షణ సిబ్బంది పాల్గొన్నారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story