Rayachoti: రాయచోటినే జిల్లా కేంద్రంగా కొనసాగించాలి గడికోట శ్రీకాంత్ రెడ్డి!

Rayachoti: అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటినే కొనసాగించాలని YSRCP నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 24 Aug 2026 4:02 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటినే జిల్లా కేంద్రంగా కొనసాగించాలి గడికోట శ్రీకాంత్ రెడ్డి!

Rayachoti: రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతంగా ఉన్న రాయచోటి ని అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వైసిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం 2022 ఏప్రిల్‌ లో రాయచోటి ని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించిందని, 2023లోనే జిల్లా ఏర్పాటుకు సంబంధించి గెజిట్ కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిపారు.

2025 డిసెంబర్‌ లో 26 జిల్లాలుగా గెజిట్ వెలువడటంతో పాటు అన్నమయ్య జిల్లా జోన్-5 లో ఉన్నట్లు జీవో కూడా వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తగిన డాక్యుమెంట్లు లేకుండానే 2025 డిసెంబర్ 31న జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు తరలించారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. 2026 ఏప్రిల్‌లో కూడా రాష్ట్రంలో 26 జిల్లాలే ఉన్నట్లు జీవో వెలువడిందని, పాత జిల్లాలే కొనసాగుతున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు ఎందుకు మార్చారో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు.

రాయచోటి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి, అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటిలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉద్యోగ నియామకాలలో ఎలాంటి చిన్నపాటి పొరపాటు కూడా జరగలేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడాన్ని తాము వ్యతిరేకించడం లేదన్నారు. అయితే స్పోర్ట్స్ కోటాలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై విచారణ జరిపించాలని మాత్రమే తాము కోరుతున్నామని స్పష్టం చేశారు. దీనిపై స్పందించాల్సిన ప్రభుత్వం తమపై నిందలు వేయడం సరైన పద్ధతి కాదన్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story