Rayachoty: ప్రత్యామ్నాయ పంటలు, నీటి పొదుపు పద్ధతులే ఏకైక మార్గం!
Rayachoty: ఎల్-నినో ప్రభావం వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
Rayachoty: ప్రత్యామ్నాయ పంటలు, నీటి పొదుపు పద్ధతులే ఏకైక మార్గం!
రాయచోటి: కడప జిల్లా వీరబల్లి మండలంలోని పలు గ్రామాలలో ఎల్-నినో ప్రభావంతో ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు శాస్త్రీయ సలహాలు అందించేందుకు వ్యవసాయ పరిశోధన స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, ఏరువాక కేంద్రం ఊటుకూరు (కడప) ఆధ్వర్యంలో, వీరబల్లి వ్యవసాయ శాఖ సంయుక్త సహకారంతో బుధవారం సానిపాయ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డా. వి. సుమతి మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఎల్-నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 60 నుండి 80 శాతం వరకు వర్షపాత లోటు నమోదైందన్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఎల్-నినో కంబాట్ బృందం రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు.
రైతులు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని, తేమను నిలుపుకోవడానికి మల్చింగ్ పద్ధతులు పాటించాలని సూచించారు. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కంది, ఆముదం, కొర్ర వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని, బిందు సేద్యం, డ్రిప్ ఇరిగేషన్ వంటి నీటి పొదుపు పద్ధతులను అవలంబించాలని సూచించారు. వర్షపు నీటిని నీటి కుంటల ద్వారా నిల్వ చేసి పంటల కీలక దశల్లో వినియోగించాలని తెలిపారు. రాబోయే వర్షాలకు అనుగుణంగా నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.
వీరబల్లి మండల టీడీపీ ఇన్‌చార్జి శ్రీ ఎం. భానుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు తప్పనిసరిగా ఈ-పంట నమోదు పూర్తి చేసుకుని పంట బీమా పొందేలా వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహాయ పరిశోధన సంచాలకులు డా. వి. చంద్రిక మాట్లాడుతూ, నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని, రానున్న రోజుల్లో పశుగ్రాస కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.




