Sambepalli: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నాగ శేషారెడ్డి సన్మానం

Sambepalli: సంబేపల్లి మండలం మోటకట్ల హైస్కూల్ ఉపాధ్యాయుడు నాగ శేషారెడ్డికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కిన సందర్భంగా ఘనంగా సన్మానించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 8 Sept 2026 6:00 PM IST
Sambepalli
X

Sambepalli: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నాగ శేషారెడ్డి సన్మానం

సంబేపల్లి: ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనదని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఉప విద్యాశాఖాధికారి నాగయ్య పేర్కొన్నారు.

సంబేపల్లి మండలం మోటకట్ల హైస్కూల్‌లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న యండపల్లి నాగ శేషారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన సందర్భంగా మంగళవారం పాఠశాల ఆవరణలో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చప్పిడి పద్మజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగయ్య మాట్లాడుతూ ఉత్తమ సేవలు, అంకితభావం, నిబద్ధతతో విధులు నిర్వర్తించినప్పుడే ఉపాధ్యాయులకు సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు.

అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన మరొక ముఖ్య అతిథి ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ కొండూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ మారుతున్న విద్యా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధనా నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని సూచించారు.

అనంతరం డైట్ ఇన్చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు పాఠశాలకు, విద్యార్థులకు అందించే సేవలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జీవితాంతం గుర్తుంచుకుంటారని ఆయన పేర్కొన్నారు.

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం యండపల్లి నాగ శేషారెడ్డి చేసిన సేవలకు దక్కిన గౌరవమని పలువురు కొనియాడారు. విద్యార్థుల పట్ల అంకితభావం, బోధనా రంగంలో నిరంతర కృషి, ఉత్తమ ఫలితాల సాధనలో ఆయన చూపిన చొరవను అభినందించారు.

అనంతరం పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది యండపల్లి నాగ శేషారెడ్డిని శాలువాలతో సత్కరించి, పూలమాలలు వేసి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి జాతీయ ఉత్తమ విద్యావేత్త అవార్డు గ్రహీత బి.ఎస్. పద్మావతి, అసిస్టెంట్ హెడ్మాస్టర్ చిదంబర రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story