Rayachoty: మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ లోకేష్ రాజీనామాకు డిమాండ్

Rayachoty: రాయచోటిలో వైఎస్ఆర్‌సిపి నేత శిబ్యాల విజయభాస్కర్ విమర్శలు. డీఎస్సీ అవకతవకలపై స్పందిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 27 July 2026 9:40 PM IST
Rayachoty
X

Rayachoty: మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ లోకేష్ రాజీనామాకు డిమాండ్

రాయచోటి: రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ భారీ అవకతవకలకు నిలయంగా మారిందని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన కూటమి ప్రభుత్వం దీనికి పూర్తి బాధ్యత వహించాలని వైఎస్ఆర్‌సిపి బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి శిబ్యాల విజయభాస్కర్ తీవ్రంగా విమర్శించారు.

డీఎస్సీ అవకతవకలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలులో వైఫల్యంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మెగా డీఎస్సీ అంటూ మెగా స్కాం

ఎన్నికల సమయంలో "తొలి సంతకం డీఎస్సీపైనే" అంటూ గొప్పలు చెప్పిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే డీఎస్సీని అవినీతి, అక్రమాలకు వేదికగా మార్చిందని ఆయన ఆరోపించారు.

స్పోర్ట్స్ కోటా పేరుతో మెరిట్ విద్యార్థులను పక్కనబెట్టి, అర్హతలకు తూట్లు పొడుస్తూ ఉద్యోగాల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని విమర్శించారు. తమకు అనుకూలంగా ప్రత్యేక జీవోలు తీసుకొచ్చి, పని పూర్తయ్యాక వాటిని రద్దు చేయడం ప్రభుత్వ దురుద్దేశానికి నిదర్శనమన్నారు.

మెరిట్‌ను చంపి... మనీని రాజుగా చేసిన ఈ డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలి. దోషులపై కఠిన చర్యలు తీసుకునే వరకు వైఎస్ఆర్‌సిపి పోరాటం కొనసాగుతుంది" అని విజయభాస్కర్ స్పష్టం చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తిగా స్తంభించింది

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పూర్తిగా స్తంభించడంతో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడిందని విమర్శించారు.

రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగి, ప్రతి విద్యార్థి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందన్నారు. జూలై 28న జరిగే నిరసన ర్యాలీని విజయవంతం చేయండి.

డీఎస్సీ అవకతవకలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలపై జూలై 28న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన ర్యాలీలో ప్రతి నిరుద్యోగ యువకుడు, ప్రతి విద్యార్థి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని శిబ్యాల విజయభాస్కర్ పిలుపునిచ్చారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story