Rayachoti: శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే!

Rayachoti: రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని డీఎస్పీ కృష్ణమోహన్ సూచన.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 13 Sept 2026 3:19 PM IST
Rayachoti
X

Rayachoti: శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే!

Rayachoti: రాయచోటి మసాపేటలోని శ్రీ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, విశిష్ట అతిథులుగా రాయచోటి అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. వెంకటాచలపతి, ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ పి.వి. సుధాకర్ రెడ్డి హాజరయ్యారు.

ముఖ్య అతిథి డీఎస్పీ కృష్ణమోహన్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థి దశలోనే భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, నైతిక విలువలను అలవర్చుకోవాలని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చూపించే మార్గదర్శకత్వాన్ని సద్వినియోగం చేసుకుని సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని డీఎస్పీ సూచించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. విద్యార్థి జీవితంలో మంచి స్నేహాలు, మంచి అలవాట్లు విజయానికి పునాదులుగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

విశిష్ట అతిథి సీఐ బి. వెంకటాచలపతి మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, సమాజంలో బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. యువతలో ప్రతిభకు కొదవ లేదని, సరైన దిశానిర్దేశంతో వారు ఎన్నో విజయాలను సాధించగలరని అన్నారు. విద్యార్థులు తమ విద్యా నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు సమాజం పట్ల సేవాభావాన్ని కలిగి ఉండాలని కోరారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులను కళాశాల యాజమాన్యం సత్కరించింది. కార్యక్రమంలో అధ్యాపకులు, వివిధ విభాగాల అధిపతులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI