Rayachoti: రాయచోటిలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు

Rayachoti: రాయచోటి శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాలలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు. నేటి నుంచి రెండు నెలల పాటు ప్రత్యేక ఐఈసీ క్యాంపెయిన్ ప్రారంభం.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 12 Aug 2026 9:10 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు

రాయచోటి: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో రాయచోటిలో యువతకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీసాక్స్ (APSACS), నాకో (NACO) ఆదేశాల మేరకు స్థానిక శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం ఈ సదస్సును ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీహెచ్ఎస్ (DCHS) డాక్టర్ లక్ష్మి ప్రసాద్ మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ వ్యాప్తి, నివారణ, పరీక్షలు, చికిత్సా సేవలపై యువతకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. యువతలో సరైన అవగాహన పెంచడం ద్వారా హెచ్‌ఐవీని గణనీయంగా నియంత్రించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఈ. శ్రీనివాస మూర్తి మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ఆరోగ్యం పట్ల బాధ్యతాయుతంగా మెలగాలని, హెచ్‌ఐవీపై ఉన్న అపోహలను తొలగించి సమాజంలో సరైన సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో ముందుండాలని పిలుపునిచ్చారు.ఇన్‌స్పెక్టర్ చాన్ బాషా, సబ్‌ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

హెచ్‌ఐవీ నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఇలాంటి అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని తాము నేర్చుకున్న విషయాలను కుటుంబ సభ్యులకు, సమాజానికి చేరవేయాలని వారు కోరారు.పీసీఎస్ఎస్ (PCSS) ప్రాజెక్ట్ డైరెక్టర్ చెన్నారెడ్డి మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ నియంత్రణ కార్యక్రమంలో నిర్దేశించిన '95-95-99' లక్ష్యాల సాధనకు ప్రజల, ముఖ్యంగా యువత భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు.

హెచ్‌ఐవీ బాధితులను ముందుగా గుర్తించడం, నిర్ధారణ అయిన వారందరినీ చికిత్సకు అనుసంధానించడం, చికిత్స తీసుకుంటున్న వారిలో వైరల్ లోడ్‌ను నియంత్రణలో ఉంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు, 8 వారాల పాటు 'ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్' (Intensified IEC Campaign) నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజా చైతన్య సేవా సంఘం ప్రాజెక్ట్ మేనేజర్ టి. స్వాతి, వారి సిబ్బంది, బయో మెడికల్ మేనేజర్ నాగార్జున, ఐసీటీసీ (ICTC) కౌన్సిలర్ ఉమాదేవి, సహయోగి స్టాఫ్ మహేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు...

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story