Rayachoti: రాయచోటి-వేంపల్లి నేషనల్ హైవే పనులకు మోక్షం!
Rayachoti: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవతో రాయచోటి–వేంపల్లి నేషనల్ హైవేకి పునర్జీవం. రూ.273.15 కోట్లతో రహదారి అభివృద్ధి పనులు పూర్తి దశకు!
Rayachoti: రాయచోటి-వేంపల్లి నేషనల్ హైవే పనులకు మోక్షం!
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పట్టుదలతో రాయచోటి–వేంపల్లి జాతీయ రహదారికి పునర్జీవం..
మూడేళ్ల నిర్లక్ష్యానికి ముగింపు... రూ.273.15 కోట్లతో రాయచోటి నియోజకవర్గంలో జాతీయ రహదారుల అభివృద్ధికి భారీ ఊపు
గత వైకాపా ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురై, మూడేళ్లపాటు నిలిచిపోయిన రాయచోటి–వేంపల్లి జాతీయ రహదారి పనులకు కూటమి ప్రభుత్వం పునర్జీవం పోసిందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
వైకాపా పాలనలో పనులు ఆగితే... కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు తీస్తోంది అని మంత్రి పేర్కొన్నారు.
రూ.241.50 కోట్ల విలువైన రాయచోటి–వేంపల్లి జాతీయ రహదారి అభివృద్ధి పనులు గత ప్రభుత్వ హయాంలో 2022లో కాంట్రాక్టర్ పనులు నిలిపివేయడంతో అర్ధాంతరంగా ఆగిపోయాయని తెలిపారు. దాదాపు మూడేళ్లపాటు ఈ కీలక రహదారి పనులను పట్టించుకోకపోవడంతో రాయచోటి–వేంపల్లి ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.
ప్రజల కష్టాలను గుర్తించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిచిపోయిన ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిరంతర పర్యవేక్షణ, ప్రత్యేక చొరవతో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో సంబంధిత మంత్రులు, అధికారులతో పలుమార్లు చర్చించి, ప్రాజెక్టుకు ఎదురైన సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
మంత్రి పట్టుదలతో కొత్త కాంట్రాక్టర్‌ను నియమించి, నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించడంతో ప్రస్తుతం రాయచోటి–వేంపల్లి జాతీయ రహదారి నిర్మాణం పూర్తి దశకు చేరుకుందని పేర్కొన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యంతో నిలిచిపోయిన అభివృద్ధికి... కూటమి ప్రభుత్వం వేగం ఇచ్చింది. గతంలో హామీలు మాత్రమే కనిపిస్తే... నేడు క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి అని మంత్రి అన్నారు.
రాయచోటి నియోజకవర్గంలో జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణ కోసం మొత్తం రూ.273.15 కోట్ల విలువైన పనులు చేపట్టడం కూటమి ప్రభుత్వ అభివృద్ధి చిత్తశుద్ధికి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సాధించిన ఫలితాలకు నిదర్శనమని తెలిపారు.




