Rayachoti: పోతిరెడ్డిపాడు సందర్శన అడ్డుకోవడం ప్రజాస్వామ్యంపై దాడి!
Rayachoti: పోతిరెడ్డిపాడు సందర్శనను కూటమి ప్రభుత్వం అడ్డుకోవడంపై సిబ్యాల విజయభాస్కర్ మండిపాటు. రాయలసీమ నీటి హక్కుల సాధన వరకు పోరాటం ఆగదని స్పష్టం.
Rayachoti: పోతిరెడ్డిపాడు సందర్శన అడ్డుకోవడం ప్రజాస్వామ్యంపై దాడి!
Rayachoti: రాయలసీమ సాగునీటి హక్కుల పరిరక్షణ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, గ్రేటర్ రాయలసీమకు దక్కాల్సిన నీటి వాటా సాధన కోసం చేపట్టిన పోతిరెడ్డిపాడు సందర్శన కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేయడమేనని గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల పరిరక్షణ సమితి కోఆర్డినేటర్ సిబ్యాల విజయభాస్కర్ తీవ్రంగా ఖండించారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాయలసీమ నీటి హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లిన రాయలసీమ లిఫ్ట్, గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. రాయలసీమకు రావాల్సిన నీటి వాటాపై ప్రభుత్వాన్ని నిలదీయడం నేరమా..? అని ఆయన ప్రశ్నించారు.
పోలీసు బలంతో ఒక కార్యక్రమాన్ని అడ్డుకోవచ్చేమో కానీ, రాయలసీమ ప్రజల గొంతును మాత్రం అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి రాయలసీమకు హక్కుగా రావాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. రాయలసీమ నీటి హక్కుల కోసం జరుగుతున్న పోరాటాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాయలసీమ లిఫ్ట్, గ్రేటర్ రాయలసీమ నీటి సాధన సమితి టాస్క్‌ఫోర్స్ సభ్యులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.
పత్రికా ప్రకటనలు, మీడియా సమావేశాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరించాలని కోరారు.నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యవసాయం అంటే దండగ కాదు.. పండగ అని నిరూపించిన నాయకుడని విజయభాస్కర్ అన్నారు. ఆయన బాటలోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
రాయలసీమ బిడ్డగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు రాయలసీమ రైతుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.రైతు వరి నాట్లు వేసిన ప్రతిసారీ సాగునీటి భరోసా కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండకూడదని, రైతులను సంక్షోభం నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. రాయలసీమకు న్యాయంగా దక్కాల్సిన సాగునీటి వాటాను సాధించి రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
రాయలసీమ నీటి హక్కుల కోసం ప్రారంభమైన ఈ పోరాటం ఒక్కరోజు కార్యక్రమం కాదని.. రాయలసీమకు న్యాయం జరిగే వరకు నిరంతరం కొనసాగుతుందని సిబ్యాల విజయభాస్కర్ స్పష్టం చేశారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి మాలే వెంకట రమణ,(బుల్లి). బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివయ్య, పలువురు పాల్గొన్నారు.




