Rayachoti: రాయచోటి 'స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర' కార్యక్రమం
Rayachoti: రాయచోటిలో ఎంఆర్ఎఫ్ కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ నిశాంత్ కుమార్. ప్రజల భాగస్వామ్యంతోనే జిల్లాను పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దుతామన్నారు.
Rayachoti: రాయచోటి 'స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర' కార్యక్రమం
రాయచోటి: జిల్లాను పరిశుభ్రంగా, పచ్చదనంతో కూడిన స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని.. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.
శనివారం రాయచోటి మున్సిపల్ పరిధిలోని శెట్టివారిపల్లి రోడ్డు డంపింగ్ యార్డు వద్ద మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (MRF)' ను ప్రారంభించి, అక్కడ జరుగుతున్న పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత నెల నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి ప్రజలు, ప్రభుత్వ అధికారులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు పెద్ద ఎత్తున స్పందించి పాల్గొన్నారని చెప్పారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు 50 వేల నుంచి 3 లక్షల జనాభా గల మున్సిపాలిటీల విభాగంలో రాష్ట్రంలోని ఉత్తమ మూడు మున్సిపాలిటీల్లో మదనపల్లె మున్సిపాలిటీకి స్థానం దక్కడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మదనపల్లె మున్సిపల్ కమిషనర్ గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఇప్పటివరకు సుమారు 2.68 లక్షల మంది పౌరులు పాల్గొని పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారని కలెక్టర్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయన్నారు.
రాయచోటి డంపింగ్ యార్డు వద్ద ప్రారంభించిన మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ ద్వారా ఘన వ్యర్థాల నిర్వహణలో మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. రాయచోటి మున్సిపాలిటీలో రోజుకు సుమారు 60 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని, వాటిలో ప్లాస్టిక్, రబ్బరు తదితర వ్యర్థాలను శాస్త్రీయంగా వేరు చేసి పునర్వినియోగానికి పంపించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు మున్సిపాలిటీకి అదనపు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. రోజుకు 20 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేసే సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అలాగే రాయచోటిలో ఘన వ్యర్థాల నిర్వహణకు అవసరమైన పూర్తి మౌలిక వసతులను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఫీకల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (FSTP) నిర్మాణం పూర్తయిందని, విద్యుత్ కనెక్షన్ అందిన వెంటనే కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు.
అదేవిధంగాచౌడేపల్లి మండలంలో గోవర్ధన్ ప్లాంట్ నిర్మాణం పూర్తయిందని, గుర్రంకొండలో మరో గోవర్ధన్ ప్లాంట్‌ను ఈ నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్లాంట్ల ద్వారా పశువుల పేడతో పాటు ఇతర జీవ వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చే అవకాశం ఉంటుందని తెలిపారు.
పరిశుభ్రతను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ నిరంతరం భాగస్వాములై అన్నమయ్య జిల్లాను పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ యామిని, రాయచోటి మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, మున్సిపల్ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




