Duvvuru: దువ్వూరులో ప్రధాని సురక్షిత మాతృత్వ అభియాన్ శిబిరం

Duvvuru: మైదుకూరు, దువ్వూరు ప్రాంతంలో ఘనంగా ఎక్స్‌టెండెడ్ ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ వైద్య శిబిరం. గర్భిణులకు పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 11 Aug 2026 7:57 PM IST
Duvvuru
X

Duvvuru: దువ్వూరులో ప్రధాని సురక్షిత మాతృత్వ అభియాన్ శిబిరం

​దువ్వూరు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం "ఎక్స్‌టెండెడ్ ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్" కార్యక్రమాన్ని చింతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ వికసిత ఆధ్వర్యంలో నిర్వహించారు. చింతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని అన్ని సచివాలయాల నుండి మొత్తం 24 మంది గర్భిణులు ఈ వైద్య శిబిరానికి హాజరయ్యారు.

​ఈ సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్ బయన్న ఆధ్వర్యంలో గర్భిణులందరికీ ఎత్తు, బరువు, రక్తహీనత (హెచ్‌బీ), రక్త గ్రూపింగ్, యూరిన్, ఆల్బుమిన్, షుగర్ తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. శిబిరానికి వచ్చిన వారిలో 10 మంది హై-రిస్క్ (ప్రమాదకర) గర్భిణులను గుర్తించి, వారికి ఉచితంగా స్కానింగ్ పరీక్షలు చేసి తగిన వైద్య సలహాలు అందించారు.

​అనంతరం డాక్టర్ వికసిత మాట్లాడుతూ, రక్తహీనత నివారణకు గర్భిణులు అంగన్‌వాడీ కేంద్రాలలో ఇచ్చే పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ప్రోటీన్లు, విటమిన్లు కలిగిన కోడిగుడ్లు, పాలు, ఖనిజ లవణాలు మరియు క్యాల్షియం సమృద్ధిగా ఉండే రాగి జావ, చిక్కీలతో పాటు రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఆకుకూరలు చేర్చుకోవాలని తెలిపారు. ప్రమాదకర గర్భిణులు నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని హెచ్చరించారు.

​ప్రతి గర్భిణీ ప్రసవానికి ప్రభుత్వ ఆసుపత్రినే ఆశ్రయించాలని, ప్రభుత్వం అందిస్తున్న జనని సురక్ష, ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన, జనని శిశు సురక్ష యోజన వంటి పథకాలను వినియోగించుకొని లబ్ధి పొందాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి రాజగోపాల్, సూపర్‌వైజర్లు శివగంగరాజు, వీరాంజనేయులు, రవికుమార్, సీహెచ్‌ఓలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story