Duvuuru: ప్రతి రైతు తప్పనిసరిగా ఇ-క్రాప్ నమోదు చేయించుకోవాలి
Duvuuru: మైదుకూరు దువ్వూరు మండలం చిన్న సింగనపల్లిలో పొలం పిలుస్తోంది కార్యక్రమం. ఇ-క్రాప్ నమోదు ఆవశ్యకతను వివరించిన ఏఓ అమర్‌నాథ్ రెడ్డి.
Duvuuru: ప్రతి రైతు తప్పనిసరిగా ఇ-క్రాప్ నమోదు చేయించుకోవాలి
దువ్వూరు: ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన ప్రతి పంటనూ రైతు సోదరులు కచ్చితంగా 'ఇ-క్రాప్' బుకింగ్ ద్వారా నమోదు చేసుకోవాలని దువ్వూరు మండల వ్యవసాయ అధికారి (AO) అమర్‌నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని చిన్న సింగనపల్లి గ్రామంలో నిర్వహించిన 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం సాగు చేసిన వరి, మొక్కజొన్న, మినుము, ఉల్లి, పసుపు, జొన్న, కంది తదితర పంటలకు ఇ-క్రాప్ నమోదు అత్యంత ప్రామాణికమని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, ఉచిత పంటల బీమా, పంట నష్టపరిహారం అందాలన్నా, పండించిన దిగుబడులను మద్దతు ధరకు ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించాలన్నా ఇ-క్రాప్ నమోదు తప్పనిసరని స్పష్టం చేశారు. వరి, మినుము, పసుపు, ఉల్లి, జొన్న, కంది పంటలకు ఆగస్టు 15వ తేదీ వరకు బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ప్రతి రైతు తప్పనిసరిగా 'విశిష్ట సంఖ్య' (Farmer Unique ID) కలిగి ఉండాలని సూచించారు.
90 శాతం సబ్సిడీతో డ్రిప్, స్ప్రింక్లర్లు:
ఎల్-నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున బోర్లు, బావుల కింద సాగు చేసే రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న 90 శాతం సబ్సిడీని ఉపయోగించుకుని డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని, దీనివల్ల నీరు, కరెంటు ఆదాతో పాటు కలుపు సమస్య తగ్గి అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.
రైతులకు యూరియా, DAP ఎరువులను పారదర్శకంగా అందించేందుకు APAMIS యాప్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. రైతులందరూ తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, పంటల యాజమాన్య పద్ధతులు మరియు ప్రభుత్వ పథకాల వివరాలను తెలుసుకోవచ్చని చెప్పారు.
ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మాట్లాడుతూ... PMDS (Pre-Monsoon Dry Sowing) పద్ధతిలో ఎకరాకు 30 రకాల విత్తనాలను (15 కేజీలు) కలిపి సాగు చేయడం ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. వర్షాలు కురిస్తే మంచి దిగుబడి వస్తుందని, వర్షాభావం ఏర్పడితే పశువులకు పశుగ్రాసంగా ఉపయోగపడుతుందని లేదా భూమిలో కలిపి దున్నడం వల్ల భూసారం పెరుగుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉద్యానవన సహాయకుడు నరసింహ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు పెద్ద ఎత్తున గ్రామ రైతులు పాల్గొన్నారు.




