Rayachoti: అమరావతి ఛాంపియన్‌షిప్–2026 క్రీడా పోటీలు ప్రారంభం!
Rayachoti: రాయచోటిలో అమరావతి ఛాంపియన్‌షిప్–2026 జిల్లా స్థాయి క్రీడా పోటీలను టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.
Rayachoti: అమరావతి ఛాంపియన్‌షిప్–2026 క్రీడా పోటీలు ప్రారంభం!
రాయచోటి: అన్నమయ్య జిల్లాలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్‌షిప్–2026 జిల్లా స్థాయి క్రీడా పోటీలను రాయచోటి నియోజకవర్గం టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి మంగళవారం రాయచోటిలో ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారిలోని ప్రతిభను గుర్తించి సరైన శిక్షణ, మెరుగైన క్రీడా మౌలిక వసతులు, అవసరమైన ప్రోత్సాహం అందిస్తే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన విజయాలు సాధించగలరని అన్నారు.
అమరావతి ఛాంపియన్‌షిప్–2026 ద్వారా గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి ఉన్నత స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు ఒక మంచి వేదిక ఏర్పడిందని పేర్కొన్నారు. క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ముందుకు సాగాలని సూచించారు.
అన్నమయ్య జిల్లాలో క్రీడా మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడంతో పాటు, క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసి, వారికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు.
క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యకరమైన జీవన విధానం పెంపొందుతాయని డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి తెలిపారు. యువత ఎక్కువ సంఖ్యలో క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా స్థాయి క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్న జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (DSDO) జి. చంద్రశేఖర్ రాయచోటి నియోజకవర్గ ఇన్‌చార్జి PD కె. వీరాంజనేయులు ,శ్రీ నర్సరాజు మరియు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సిబ్బందిని డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి అభినందించారు.
క్రీడాకారులకు అవసరమైన క్రీడా సామగ్రి, మైదానాలు, తాగునీరు, టిఫిన్, మధ్యాహ్న భోజనం, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు. క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేయడం అభినందనీయమని అన్నారు.
అన్నమయ్య జిల్లా నుంచి భవిష్యత్‌లో మరింత మంది రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు వెలుగులోకి వచ్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు.




