Duvvur: నీరు లేని తొట్టెలు.. దాహార్తితో మూగజీవాల విలవిల
Duvvur: దువ్వూరు మండలంలో అధికారుల నిర్లక్ష్యం మూగజీవాల ప్రాణాల మీదకు తెస్తోంది. ఉపాధి హామీ నిధులతో నిర్మించిన నీటి తొట్టెలు చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి.
Duvvur: నీరు లేని తొట్టెలు.. దాహార్తితో మూగజీవాల విలవిల
దువ్వూరు: ప్రభుత్వం ఒక లక్ష్యంతో పథకాలను ప్రవేశపెడితే, క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం ఆ ఆశయానికి తూట్లు పొడుస్తోంది. వేసవి తీవ్రత దృష్ట్యా అడవిలోని మరియు గ్రామాల సమీపంలోని మూగజీవాల దాహార్తి తీర్చడానికి ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు నేడు నిరుపయోగంగా మారాయి.దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేట పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నీటి తొట్టె పరిస్థితి ప్రస్తుతం అత్యంత అధ్వానంగా మారింది. లక్షల రూపాయల వ్యయంతో వీటిని నిర్మించినప్పటికీ, నిర్వహణను గాలికొదిలేయడంతో ఇవి కేవలం సిమెంట్ కట్టడాలుగానే మిగిలిపోయాయి.
ఒక్క చుక్క నీరు కూడా లేక వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం ఎండలు మండుతుండటంతో భానుడి ప్రతాపానికి గుంటలు, వాగులు ఎండిపోయాయి. అడవి నుంచి వచ్చే మూగజీవాలు, మేతకు వెళ్లే పశువులు తాగునీరు దొరక్క అల్లాడిపోతున్నాయి. నీటి కోసం కిలోమీటర్ల మేర వెతుకులాట తప్పడం లేదని పశువుల కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోకముందే అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.నోరు లేని జీవాల దాహార్తిని గుర్తించి, అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి పుల్లారెడ్డిపేట వద్ద ఉన్న తొట్టెలను నింపాలి" అని పలువురు డిమాండ్ చేస్తున్నారు.




