Mydukuru: విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం

Mydukuru: కడప జిల్లా మైదుకూరు విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద పెట్రోల్ పోసుకుని కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం. బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఉద్రిక్తత, అధికారులపై ఆగ్రహం.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 21 Aug 2026 1:35 PM IST
Mydukuru
X

Mydukuru: విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం

Mydukuru: వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నియోజకవర్గవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రైవేట్ విద్యుత్ కాంట్రాక్టర్లకు గత ఏడాది కాలంగా చేసిన పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చాపాడుకు చెందిన కాంట్రాక్టర్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న తోటి కాంట్రాక్టర్లు, స్థానికులు వెంటనే అప్రమత్తమై నాగరాజును అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

​మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలో సుమారు వందలాది పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లు పూర్తి చేసినప్పటికీ, సుమారు ఏడాది కాలంగా ఒక్క బిల్లు కూడా ప్రభుత్వం నుండి మంజూరు కాలేదని బాధితులు వాపోయారు. బిల్లులు రాకపోవడంతో పెట్టుబడులకు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్థానిక శాసనసభ్యులు (ఎమ్మెల్యే) స్వయంగా చొరవ తీసుకుని వెంటనే బిల్లులను అప్‌లోడ్ చేయాలని ఆదేశించినప్పటికీ, స్థానిక అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీ) శ్రీకాంత్ బిల్లులను ప్రాసెస్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తున్నారని కాంట్రాక్టర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

​అంతేకాకుండా, గత వారం రోజుల క్రితం బిల్లులు రాక మనస్తాపంతో మరో ఇద్దరు కాంట్రాక్టర్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారని, అయినప్పటికీ విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల్లో గానీ, ప్రభుత్వ యంత్రాంగంలో గానీ ఎలాంటి చలనం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, పెండింగ్‌లో ఉన్న తమ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని బాధిత కాంట్రాక్టర్లు హెచ్చరించారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story