Rayachoti: స్వచ్ఛ ఆంధ్ర పనులను పరిశీలించిన కలెక్టర్ నిశాంత్ కుమార్!
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి పరిధిలోని చిన్నమండెం మండలంలో కలెక్టర్ నిశాంత్ కుమార్ స్వచ్ఛతా కార్యక్రమాలను పరిశీలించారు.
Rayachoti: స్వచ్ఛ ఆంధ్ర పనులను పరిశీలించిన కలెక్టర్ నిశాంత్ కుమార్!
రాయచోటి: చిన్నమండెం, మండలం లో శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా “ఆరోగ్యవంతమైనపాఠశాలలు–ఆరోగ్యవంతమైన ఆంధ్ర” థీమ్‌తో చేపట్టిన కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొని, చిన్నమండెం గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన పాఠశాలలు, ఆరోగ్యకరమైన పరిసరాలు విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని తెలిపారు.
చిన్నమండెంలోని ప్రాథమిక పాఠశాల (ఉర్దూ)ను జిల్లా కలెక్టర్ సందర్శించి పాఠశాల పరిసరాల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛత కార్యక్రమాలను పరిశీలించారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సౌకర్యం, చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలోని వీధి డ్రెయిన్లతో పాటు హైవే రోడ్డుకు సమీపంలో ఉన్న పెద్ద కాలువను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించి, డ్రెయిన్లలో నీరు సక్రమంగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాలువల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారికి నోటీసులు జారీ చేయాలని సూచించారు.
పరిశుభ్రత అనేది ఒక్కరోజు నిర్వహించే కార్యక్రమం కాదని, నిరంతర ప్రక్రియగా కొనసాగాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామాలు, పాఠశాలలు, ప్రధాన రహదారులు, డ్రెయిన్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించవచ్చని తెలిపారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, చెత్త నుంచి సంపద తయారీకి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్ రెడ్డి, ఎమ్మార్వో రామాంజనేయులు, సంబంధిత అధికారులు, పంచాయతీ సిబ్బంది, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




