Madanapalle: చల్లావారిపల్లిలో స్థల వివాదం.. సబ్ కలెక్టర్‌కు గ్రామస్తుల వినతి!
Madanapalle: నిమ్మనపల్లి మండలం చల్లావారిపల్లిలో పీర్ల చావడి స్థలం, ప్రభుత్వ బోరు, నీటి తొట్టి ఆక్రమణపై గ్రామస్తులు మదనపల్లె సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
Madanapalle: చల్లావారిపల్లిలో స్థల వివాదం.. సబ్ కలెక్టర్‌కు గ్రామస్తుల వినతి!
మదనపల్లె: మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం ముస్టూరు గ్రామం చల్లావారిపల్లిలో స్థల వివాదం నెలకొంది. తమ పూర్వీకుల నుంచి కొనసాగుతున్న స్థలాన్ని కాపాడడంతో పాటు అక్కడి ప్రజలకు ఉపయోగపడుతున్న బోరు, నీటి తొట్టిని పరిరక్షించాలని కోరుతూ చల్లావారిపల్లి గ్రామస్తులు సోమవారం మదనపల్లె సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్టూరు గ్రామ సర్వే నంబర్ 1494లోని గ్రామకంఠం పరిధిలో సుమారు 2.00 సెంట్ల స్థలం ఉందని, తమ పూర్వీకుల కాలం నుంచి అక్కడ ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నామని తెలిపారు. అదే స్థలంలో హిందువులు, ముస్లింలు కలిసి కొంత భాగాన్ని కేటాయించుకుని పీర్ల చావడిని నిర్మించుకున్నారని పేర్కొన్నారు. పూర్వం నుంచి మొహర్రం సందర్భంగా పీర్లను ప్రతిష్ఠించి గ్రామస్తులంతా కలిసి పది రోజులపాటు పండుగను నిర్వహించేవారని తెలిపారు.
ఆ ప్రదేశంలో బేతాళుడిని కూడా ఆరాధిస్తూ తమ ఆచారాలను కొనసాగిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. సుమారు 20 సంవత్సరాల క్రితం తొమ్మిది పీర్లకు సంబంధించి ఏమి జరిగిందో తమకు తెలియదని తెలిపారు. అనంతరం పీర్లు లేకపోవడంతో మొహర్రం పండుగను నిర్వహించలేకపోతున్నామని చెప్పారు. అయితే తమ పూర్వీకులు కేటాయించిన స్థలం మాత్రం ఇప్పటికీ ఉందని పేర్కొన్నారు.
ఇటీవల కొందరు ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు ఆ స్థలంలో మసీదులో పనిచేసే గురువులకు ఇళ్లు నిర్మించేందుకు స్థలం అవసరమంటూ నిమ్మనపల్లి తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంపై తహసీల్దార్ ఇరువర్గాలకు చెందిన ఐదుగురిని పిలిపించి విచారణ జరిపారని చెప్పారు. స్థలంలో కొంత భాగాన్ని తమకు కేటాయిస్తే వినాయకుని ఆలయం నిర్మించుకుంటామని తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు.
అయితే తమతో తహసీల్దార్ అనుచితంగా మాట్లాడి, వినాయకుని విగ్రహాన్ని చెరువులో పడేస్తారా అంటూ హేళన చేశారని వారు ఆరోపించారు. అధికారుల నుంచి తమకు సమానంగా న్యాయం జరగాలని కోరారు. బోరు, నీటి తొట్టి ఆక్రమించారని ఆరోపణ అదే స్థలంలో గ్రామస్తులందరికీ ఉపయోగపడే హ్యాండ్‌బోర్ ఉందని, బోరు పక్కనే పశువులు నీరు తాగేందుకు ప్రభుత్వం నిర్మించిన నీటి తొట్టి కూడా ఉందని గ్రామస్తులు తెలిపారు.
అయితే చల్లావారిపల్లికి చెందిన ఎస్. సయ్యద్ బాషా, తండ్రి ఉస్మాన్ సాబ్ అనే వ్యక్తి బోరు, నీటి తొట్టిని తన ఆవరణలో కలుపుకుని బండలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. దీంతో పశువులకు నీరు అందకుండా పోయిందని, విద్యుత్ సరఫరా లేని సమయంలో గ్రామస్తులకు బోరు నీరు కూడా అందుబాటులో లేకుండా పోతోందని తెలిపారు. ప్రజలందరికీ ఉపయోగపడే ప్రభుత్వ బోరు, నీటి తొట్టిని యథాస్థితిలోకి తీసుకురావాలని కోరారు.
స్థల వివాదంతో పాటు బోరు, నీటి తొట్టి సమస్యపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను నిర్ధారించాలని గ్రామస్తులు కోరారు. ఇరువర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుని, పూర్వీకుల నుంచి కొనసాగుతున్న స్థలాన్ని పరిరక్షించాలని, గ్రామస్తుల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సబ్ కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.




