Sambepalli: కౌలు డబ్బులడిగిన వృద్ధుడిపై దాడి: నిందితుడికి ఏడాది జైలు
Sambepalli: సంబేపల్లిలో కౌలు డబ్బులడిగిన 75 ఏళ్ల వృద్ధుడిపై దాడి చేసిన కేసులో నిందితుడికి ఏడాది జైలు, రూ.5 వేల జరిమానా విధిస్తూ రాయచోటి కోర్టు తీర్పునిచ్చింది.
Sambepalli: కౌలు డబ్బులడిగిన వృద్ధుడిపై దాడి: నిందితుడికి ఏడాది జైలు
Sambepalli: సంబేపల్లి మండలం, శెట్టిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కడియలవాండ్లపల్లికి చెందిన మద్దిపట్ల నారాయణ (75) తన వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన కడియాల పాపయ్య (52) కు కౌలుకు ఇచ్చాడు. కౌలు గడువు ముగిసినప్పటికీ పాపయ్య డబ్బులు చెల్లించకుండా ఎగవేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో తన కౌలు డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు ఆగ్రహించిన పాపయ్య, వృద్ధుడైన నారాయణపై భౌతికంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
ఈ ఘటనపై బాధితుని ఫిర్యాదు మేరకు అప్పటి సంబేపల్లి ఎస్ఐ ఎం. హాసం గారు 2018లో కేసు నమోదు చేశారు (రాయచోటి సబ్ డివిజన్, సంబేపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్: 295/2018, IPC సెక్షన్లు 324, 325). పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి, సరైన ఆధారాలను సేకరించి కోర్టులో త్వరితగతిన ఛార్జ్ షీట్ (CC నెంబర్ 508/2019) దాఖలు చేశారు.
ఈ కేసుపై రాయచోటి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీ టి. సుయోధన గారి ఎదుట జరిగిన విచారణలో నిందితుడు పాపయ్యపై నేరం రుజువు కావడంతో, నేడు అతనికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు ₹5,000/- జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించారు.
ఈ తీర్పుపై అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు హర్షం వ్యక్తం చేశారు. వృద్ధులు, బలహీన వర్గాలపై దాడులకు పాల్పడితే ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షార్హులేనని ఈ తీర్పు స్పష్టం చేస్తోందన్నారు. ఈ కేసును మొదటి నుంచి సమర్థవంతంగా పర్యవేక్షించి నిందితుడికి శిక్ష పడేలా చేసిన రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్, రాయచోటి రూరల్ సీఐ ఎస్.కె. రోషన్, సంబేపల్లి ఎస్ఐ జి. రవికుమార్ లను ఎస్పీ గారు అభినందించారు. అలాగే, న్యాయస్థానంలో వాదనలు బలంగా వినిపించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.లక్ష్మి సాయి రామకృష్ణను, ఎలాంటి జాప్యం లేకుండా సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరచడంలో కీలక పాత్ర పోషించిన కోర్టు కానిస్టేబుల్ జి. శివశంకర్ మరియు లైజన్ ఆఫీసర్ వి. మస్తాన్ వలి ల పనితీరును ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.




