Kadapa: తెలుగుభాషపై టీడీపీ, వైసీపీ 'దొందూ దొందే'!

Kadapa: తెలుగుభాష విషయంలో టీడీపీ, వైసీపీలది 'దొందూ దొందే' అంటూ ఏపీసీసీ మీడియా ఛైర్మన్ డాక్టర్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు.

K. KESAVA PRATHAP REDDY, KADAPA
Published on: 29 May 2026 5:53 PM IST
Kadapa
X

Kadapa: తెలుగుభాషపై టీడీపీ, వైసీపీ 'దొందూ దొందే'!

కడప: తెలుగుభాష విషయంపై టిడిపి, వైకాపా లది దొందూ దొందే అని ఏపిసిసి మీడియా ఛైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిఎం చంద్రబాబు, వైకాపా అధినేత జగన్ ఇద్దరు కూడా తెలుగుభాష విధ్వంసకులేనని ధ్వజమెత్తారు. గత కొద్ది సంవత్సరాల వరకు తెలుగుభాష ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో ఐదో స్థానంలో ఉండేదన్నారు.

ప్రస్తుతం ఏడో స్థానానికి దిగజారిందని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 2500 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం కలిగిన అతి ప్రాచీనమైన భాష తెలుగుభాష అన్నారు. తెలుగుభాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనే ఒక విదేశీయుడైన నికోలాస్ కాంటి ప్రస్థుతించాడని, తెలుగుభాషను సుందర తెలుగు అని ప్రఖ్యాత తమిళ కవి సుబ్రమణ్య భారతీ కీర్తించారన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అనే సాహితీ సమరాంగన సార్వభౌముడైన శ్రీకృష్ణ దేవరాయలు ప్రశంసించారన్నారు.

తెలుగుభాష, సాహిత్యం, లలిత కళలు, జానపద విజ్ఞానంలో పరిశోధనలు, ప్రత్యేక కోర్సుల కోసం 1985లో మాజీ సిఎం ఎన్టీఆర్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారన్నారు. అధికార భాషగా తెలుగును ఎన్టీఆర్ సమర్థవంతంగా అమలు చేశారన్నారు. ఎన్టీఆర్ తన జీవితాంతం తెలుగు భాషాభివృధ్ధికీ మనసా, వాచా, కర్మణా త్రికరణ శుద్ధిగా కృషి చేశారన్నారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ లో తెలుగుభాష రోజు రోజుకు తన ప్రతిష్టను, విశిష్టతను కోల్పోతూ ఉందన్నారు.

పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ వైకాపా ప్రభుత్వం జీఓ 85 జారీ చేసిందని, ఇది ఒక చారిత్రాత్మక తప్పిదమన్నారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆ జీఓ ను కొనసాగిస్తూ ఉండడం మరో చారిత్రక తప్పిదమని తులసిరెడ్డి అన్నారు. ఆ జీఓ కారణంగా 2026 పదోతరగతి పరీక్షల్లో 95 శాతం మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో పరిక్షలు రాశారని, మిగతా ఐదు శాతంలో తమిళ్, కన్నడ, ఒరియా, ఉర్దూ, సంస్కృతం, తెలుగు మాధ్యమ విధ్యార్థులు ఉన్నారన్నారు.

దీనిని బట్టి చూస్తే ఆంద్రప్రదేశ్ లో తెలుగుభాష దుస్థితి స్పష్టమవుతోందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే అచిర కాలంలో తెలుగుభాష చదివేవారు, రాసేవారు, మాట్లాడేవారు ఉండరన్నారు. తెలుగుజాతి పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం, అభిమానం ఉన్నా జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 85 ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ఉద్యోగాల్లో, ఉన్నత విద్యా ప్రవేశాల్లో రెండు శాతం అదనపు మార్కులు కలపాలని తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డా.సుబ్రమణ్యం, ప్రసాద్ గౌడ్, సుబ్బారెడ్డి, రామకృష్ణ, అమర్నాథరెడ్డి, ఉత్తన్న, రవీంద్రారెడ్డి, బండారు వెంకటేషు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

K. KESAVA PRATHAP REDDY, KADAPA

K. KESAVA PRATHAP REDDY, KADAPA

Next Story