Galiveedu: గాలివీడు మండలంలో బావిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
Galiveedu: అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం బోరెడ్డి గారి పల్లెలో బావిలో మూటకట్టిన స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
Galiveedu: గాలివీడు మండలంలో బావిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
గాలివీడు: అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో దారుణ ఘటన వెలుగుచూసింది. గుర్తుతెలియని ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హంతకులు ఆధారాలు దొరకకుండా శవాన్ని సంచిలో మూటకట్టి బావిలో పడేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గాలివీడు మండలం, బక్కిరెడ్డి గారి పల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని బోరెడ్డి గారి పల్లె కస్పాలోని 'ఇరగం రెడ్డి బావి'లో ఓ గుర్తుతెలియని మగ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.దుండగులు అత్యంత అమానుషంగా వ్యవహరించారు. శవాన్ని ఓ సంచిలో చుట్టి, మూటకట్టి ఎవరికీ అనుమానం రాకుండా బావిలో పడేశారు.మృతుడి వయసు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మృతదేహంపై టీ షర్టు, ప్యాంటు ఉన్నాయి.దుండగులు ఈ వ్యక్తిని వేరే ఏదైనా ప్రాంతంలో హత్య చేసి, ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి బావిలో పడేశారా?లేక చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వ్యక్తినే హత్య చేసి, ఇక్కడ పడేసి ఉంటారా? అన్న కోణంలో పలువురు చర్చించుకుంటున్నారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి, క్లూస్ టీమ్ సహాయంతో చుట్టుపక్కల కీలక ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముందుగా మృతుడు ఎవరనేది గుర్తించే పనిలో పడ్డారు. మిస్సింగ్ కేసుల ఆధారంగా విచారణ చేపట్టి, హంతకులను పట్టుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.




