Xi Jinping Taiwan Warning: ప్రపంచంలో మరో కొత్త సమస్యః తైవాన్ చుట్టూ రాజకీయ చదరంగం
బీజింగ్‌లోని అత్యంత కట్టుదిట్టమైన 'జోంగ్నాన్హై' కాంప్లెక్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన భేటీ ప్రపంచ గమనాన్ని మార్చే ఒక చదరంగంలా కనిపిస్తోంది.
Xi Jinping Taiwan Warning: బీజింగ్‌లోని అత్యంత కట్టుదిట్టమైన 'జోంగ్నాన్హై' కాంప్లెక్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన భేటీ కేవలం రెండు దేశాల మధ్య చర్చ మాత్రమే కాదు, ఇది ప్రపంచ గమనాన్ని మార్చే ఒక చదరంగంలా కనిపిస్తోంది. ఈ చర్చల్లో ప్రధానంగా వినిపించిన మాట 'తైవాన్'. ఈ అంశంపై జిన్‌పింగ్ వాడిన భాష, చేసిన హెచ్చరికలు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.
నిప్పు-నీరు కలవవు - జిన్‌పింగ్ కఠిన స్వరం
తైవాన్ అంశంపై చైనా వైఖరి ఎప్పుడూ స్పష్టమే, కానీ ఈసారి జిన్‌పింగ్ మరింత ఘాటుగా స్పందించారు. "తైవాన్ స్వాతంత్య్రం, శాంతి అనేవి నిప్పు-నీరు లాంటివి.. అవి ఎప్పటికీ కలవవు" అని ఆయన తేల్చి చెప్పారు. ఈ సంబంధాన్ని సరిగ్గా నిర్వహిస్తే స్థిరత్వం ఉంటుందని, లేదంటే అది ఘర్షణకు దారితీసి అత్యంత ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని నేరుగా ట్రంప్‌కే హెచ్చరికలు పంపారు. ట్రంప్ తన నిర్ణయాలను మార్చుకుంటారనే చరిత్ర ఉంది కాబట్టే, జిన్‌పింగ్ స్వయంగా ఈ విషయాన్ని నొక్కి చెప్పినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
థుసిడిడెస్ ట్రాప్ అంటే ఏమిటి?
చర్చల సందర్భంగా జిన్‌పింగ్ పురాతన గ్రీకు సిద్ధాంతమైన 'థుసిడిడెస్ ట్రాప్'ను ప్రస్తావించారు. అంటే, ఒక అగ్రరాజ్యం ఎదుగుతున్న మరో శక్తిని అడ్డుకోవాలని చూసినప్పుడు అది అనివార్యంగా యుద్ధానికి దారితీస్తుంది. పశ్చిమ దేశాల ప్రభావం తగ్గుతోందని, చైనా ఎదుగుతోందని నమ్ముతున్న జిన్‌పింగ్, తైవాన్ విషయంలో ఉమ్మడి ఆమోదం లేకపోతే అమెరికాతో ముఖాముఖి తలపడక తప్పదనే హెచ్చరికను ఇందులో పొందుపరిచారు.
మరోవైపు ఇరాన్ మంటలు
తైవాన్‌పై ఇంత ఉద్రిక్తత ఉన్నప్పటికీ, ఇరాన్ విషయంలో మాత్రం ఇద్దరు నేతలు ఒకే తాటిపై ఉన్నట్లు ట్రంప్ ప్రకటించడం విశేషం. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసుకోకూడదని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇది ప్రపంచానికి ఊరటనిచ్చే అంశమే కావొచ్చు. కానీ, ఇరాన్ దీనిని ఎంతవరకు సమ్మతిస్తుంది అన్నది తెలియాలి. తాము అణ్వాయుధాలు తయారు చేసుకోవడం లేదని, శుద్ధిచేసిన యూరేనియంను ఇతర అవసరాల కోసం వినియోగించుకుంటున్నట్టు ఇప్పటికే పలుమార్లు ఇరాన్ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని రష్యా కూడా దృవీకరించింది. అంతేకాదు, అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి ఎప్పుడూ తెరిచే ఉంచాలని ఇద్దరు నేతలు అంగీకరించారు. ఇక ఈ చర్చల అనంతరం ట్రంప్ తనదైన శైలిలో మరెవ్వరూ పరిష్కరించలేని సమస్యలను తాము పరిష్కరించాలమని ప్రకటించారు.
చైనా వ్యూహం పారుతుందా?
ట్రంప్ బృందంలో చైనా వ్యవహారాలు క్షుణ్ణంగా తెలిసిన నిపుణులు లేకపోవడం చైనాకు అడ్వాంటేజ్‌గా మారిందనే వాదన వినిపిస్తోంది. తైవాన్ విషయంలో భయం పెట్టి, బదులుగా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు లేదా మార్కెట్ ప్రవేశం వంటి అంశాల్లో ట్రంప్ నుంచి రాయితీలు పొందాలని చైనా భావిస్తోంది. మరి అమెరికా తన సుదీర్ఘకాలపు 'వ్యూహాత్మక అస్పష్టత' విధానాన్ని వీడుతుందా లేదా అనేది వేచి చూడాలి. మొత్తంగా చూసుకుంటే బీజింగ్ చర్చలు శాంతి వైపు సాగుతున్నాయా లేక పెను తుఫానుకు ముందున్న ప్రశాంతతనా అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది.




