World War 3 : హోర్ముజ్ సెగతో మూడో ప్రపంచ యుద్ధం? ఇరాన్ బోట్లను కూల్చేయాలని ట్రంప్ సంచలన ఆదేశం

World War 3 : హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ బోట్లను కూల్చేయాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో మూడో ప్రపంచ యుద్ధం భయం నెలకొంది. ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది.

CR Reddy
Published on: 25 April 2026 8:27 AM IST
World War 3
X

World War 3

World War 3 : ప్రపంచం మరో మహా యుద్ధం ముంగిట నిలబడిందా? మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఉద్రిక్తతలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ కేంద్రంగా అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన ఈ మైండ్ గేమ్ ఇప్పుడు క్షిపణుల దాడి వరకు వెళ్లేలా కనిపిస్తోంది. గ్లోబల్ ఆయిల్ సప్లైకి గుండెకాయ వంటి ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

హోర్ముజ్ జలసంధిలో ట్రంప్ ఆదేశాల కలకలం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన నౌకాదళానికి జారీ చేసిన ఒక ఉత్తర్వు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్‌కు చెందిన మైన్లు (సముద్రంలో పేలే బాంబులు) బిగించే బోట్లు కనిపిస్తే వెంటనే కాల్చివేయాలని ట్రంప్ ఆదేశించారు. ఇరాన్ తన చిన్న, వేగవంతమైన బోట్ల ద్వారా ఈ కీలక జలమార్గంలో మైన్లను ఏర్పాటు చేస్తూ, ప్రపంచ దేశాలకు వెళ్లే చమురు రవాణాను అడ్డుకోవాలని చూస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికా నౌకాదళం ఇప్పటికే హోర్ముజ్ ప్రాంతాన్ని తమ గుప్పిట్లోకి తీసుకుంది.

అమెరికా ప్లాన్-A, ప్లాన్-B

హోర్ముజ్ విషయంలో అమెరికా రెండు రకాల వ్యూహాలను అమలు చేస్తోంది. మొదటిది, ఇరాన్ కొత్తగా మైన్లు వేయకుండా అడ్డుకోవడం. ఇందుకోసం డ్రోన్లు, నిఘా నౌకల ద్వారా ప్రతి ఇరాన్ బోటును లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇక రెండోది, అత్యంత కష్టమైనది.. ఇప్పటికే సముద్రంలో బిగించిన మైన్లను గుర్తించి తొలగించడం. సముద్ర గర్భంలో ఉన్న బాంబులను వెలికితీయడం ప్రమాదంతో కూడుకున్న పని కావడంతో, అమెరికా తన మిత్రదేశమైన జపాన్ నుంచి మైన్ స్వీపర్ నౌకలను రప్పించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఆపరేషన్ సుదీర్ఘకాలం సాగే అవకాశం ఉందని పెంటగాన్ వర్గాలు అంటున్నాయి.

ఇజ్రాయెల్ సిద్ధం.. టార్గెట్ ఇరాన్

ఈ ఉద్రిక్తతల మధ్య ఇజ్రాయెల్ కూడా రంగంలోకి దిగింది. ఇరాన్‌పై భారీ ఎత్తున విరుచుకుపడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కేవలం అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రకటించింది. ఈసారి దాడులు కేవలం సైనిక స్థావరాలకే పరిమితం కాకుండా, ఇరాన్ ఆర్థిక వెన్నెముక అయిన చమురు, ఇంధన మౌలిక సదుపాయాలపైనే ఉండబోతున్నాయని సంకేతాలిచ్చింది. టెహ్రాన్, టెల్ అవీవ్ మధ్య ప్రస్తుతం ప్రత్యక్ష దాడులు ఆగిపోయినట్లు కనిపిస్తున్నా, లోలోపల పెద్ద యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.

పెంటగాన్ వార్నింగ్.. ఇరాన్‌కు డీల్ ఆఫర్

అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ తాజా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "హోర్ముజ్ జలసంధిలో మా దిగ్బంధం కొనసాగుతోంది. అమెరికా అనుమతి లేనిదే ఏ ఇరాన్ నౌక అక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. ఇతర దేశాల వాణిజ్య నౌకలు మా అనుమతితో వెళ్ళవచ్చు. ఇరాన్ తన పద్ధతి మార్చుకుని ఒక మంచి ఒప్పందానికి రావడానికి ఇదే ఆఖరి అవకాశం" అని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ పట్టుదలగా ముందుకు వెళ్తే, అది నేరుగా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story