Trump Iran Warning: పాపం ట్రంప్‌కు కలిసిరాని కాలం...అందుకే ఇరాన్‌పై ఆగ్రహం

ట్రంప్‌ ఇరాన్‌పై ఆగ్రహం వెనుక వేధిస్తున్న స్వదేశీ, ఆర్థికపరమైన సంక్షోభాలే కారణమా...?

Balachander
Published on: 20 May 2026 11:59 AM IST
Trump Iran Warning: పాపం ట్రంప్‌కు కలిసిరాని కాలం...అందుకే ఇరాన్‌పై ఆగ్రహం
X

Trump Iran Warning: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ఒకవైపు శాంతి చర్చలు ప్రతిష్ఠంభనలోకి వెళ్లడం, మరోవైపు "ఇరాన్ త్వరగా లొంగిపోకపోతే వారి ఉనికి లేకుండా చేస్తాం" అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా వైట్ హౌస్ వేదికగా ట్రంప్ మాట్లాడుతూ, మరో రెండు మూడు రోజుల్లో ఇరాన్‌పై భారీ సైనిక దాడులు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కేవలం కొన్ని గల్ఫ్ దేశాల విజ్ఞప్తి మేరకే ప్రస్తుతానికి దాడిని వాయిదా వేసినట్లు ప్రకటించారు. అయితే, పైకి ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా అమెరికా ఈ దూకుడు ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తున్నా.. దీని వెనుక ట్రంప్‌ను వేధిస్తున్న స్వదేశీ, ఆర్థికపరమైన సంక్షోభాలే అసలు కారణమనే విశ్లేషణలు బలంగా వినబడుతున్నాయి.

దేశంలో అసంతృప్తి.. విదేశాల్లో వైఫల్యాలు

ప్రస్తుతం ట్రంప్‌కు సొంత దేశంలోనే రాజకీయంగా గడ్డు కాలం నడుస్తోంది. అంతర్గత విధానాలపై అమెరికా ప్రజల్లో, ప్రతిపక్షాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికి తోడు, ఇటీవల ఆయన చేపట్టిన ప్రతిష్టాత్మక విదేశీ పర్యటనలు ఏవీ ఆశించిన రాజకీయ లేదా దౌత్యపరమైన ఫలితాలను ఇవ్వలేదు. ఈ వైఫల్యాల నుండి స్వదేశీ ప్రజల దృష్టిని మళ్లించడానికి, ఎప్పటికప్పుడు అమెరికాకు బద్ధశత్రువుగా ఉన్న ఇరాన్‌ను తెరపైకి తెచ్చి జాతీయవాదాన్ని రగల్చడం ట్రంప్‌కు ఒక రాజకీయ వ్యూహంగా మారింది.

‘డాలర్’ సామ్రాజ్యానికి బీటలు.. ఆర్థిక ఇబ్బందులు

అమెరికాకు అసలైన గుండెకోత మిగులుస్తున్నది మాత్రం అంతర్జాతీయ ఆర్థిక ముఖచిత్రంలో వస్తున్న మార్పులే. ప్రపంచవ్యాప్తంగా అమెరికా డాలర్ ఆధిపత్యం క్రమంగా సన్నగిల్లుతోంది. చైనా, రష్యా, భారత్‌తో పాటు పలు ఆసియా, ఐరోపా దేశాలు అంతర్జాతీయ వ్యాపారాల కోసం డాలర్‌ను పక్కనబెట్టి, తమ సొంత కరెన్సీల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ పరిణామం అమెరికా ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రపంచ మార్కెట్‌పై పట్టు కోల్పోతున్నామనే ఆందోళన వైట్ హౌస్‌ను కలవరపెడుతోంది. ఈ ఆర్థిక సంక్షోభం సృష్టించిన నిరాశ, కోపాన్నే ట్రంప్ ఇప్పుడు ఇరాన్‌పై ఉద్రిక్తతల రూపంలో వెళ్లగక్కుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

గల్ఫ్ దేశాల జోక్యం.. వాయిదా పడ్డ దాడులు

నిజానికి, గత మంగళవారమే ఇరాన్‌పై అమెరికా ఒక భారీ వైమానిక దాడికి అంతా సిద్ధం చేసుకుంది. నిర్ణీత సమయానికి కేవలం గంట ముందు మాత్రమే ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీనికి కారణం సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ వంటి గల్ఫ్ దేశాల నుండి వచ్చిన అత్యవసర ఫోన్ కాల్స్. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన 'స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్' జలసంధిపై ప్రస్తుతం ఇరాన్ గట్టి పట్టు సాధించింది. ఒకవేళ అమెరికా గనుక దాడి చేస్తే, గల్ఫ్ రీజియన్ మొత్తం యుద్ధభూమిగా మారి ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తుతుందని ఆయా దేశాలు హెచ్చరించడంతో ట్రంప్ తాత్కాలికంగా వెనక్కి తగ్గారు.

గత ఏప్రిల్ 8న ఇరుదేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత జరిగిన ఒకే ఒక్క రౌండ్ చర్చలు విఫలమయ్యాయి. సరిగ్గా నచ్చిన ఒప్పందం కుదరకపోతే ఏ క్షణంలోనైనా ఇరాన్‌పై పూర్తి స్థాయి సైనిక దాడికి దిగాలని అమెరికా సైన్యానికి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆధిపత్య పోరు కేవలం ఇరాన్‌ను నియంత్రించడానికి మాత్రమే కాదు, ప్రపంచ వేదికపై అమెరికా కోల్పోతున్న పట్టును నిలబెట్టుకోవడానికి ట్రంప్ ఆడుతున్న ప్రమాదకరమైన జూదమని స్పష్టమవుతోంది. మరి ఈ జూదంలో అమెరికా విజయం సాధిస్తుందా లేక ఓడిపోయి పట్టును కొల్పోతుందా కాలమే సమాధానం చెప్పాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story