Russia Ukraine War Mediation: ఇరాన్‌-అమెరికా మధ్యవర్తిగా పాక్‌..మరి ఉక్రెయిన్‌-రష్యా మధ్యవర్తిగా ఎవరు?

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈయూ మధ్యవర్తిత్వం చేస్తుందా? ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చలకు తెర.

Balachander
Published on: 27 May 2026 1:26 PM IST
Russia Ukraine War Mediation: ఇరాన్‌-అమెరికా మధ్యవర్తిగా పాక్‌..మరి ఉక్రెయిన్‌-రష్యా మధ్యవర్తిగా ఎవరు?
X

Russia Ukraine War Mediation: ప్రపంచంలో జరుగుతున్న రెండు యుద్ధాలు ఇప్పుడు దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ యుద్ధాల ప్రభావంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరౌతున్నారు. ఇక ఈ యుద్ధాల తీవ్రతను తగ్గించేందుకు కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇరాన్‌ అమెరికా మధ్యనున్న ఉద్రిక్తతలు తగ్గించడానికి పాకిస్తాన్‌ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. దేశీయంగా పెరిగిన చమురు ధరలు, ఆర్థిక సంక్షోభం, ప్రజల తిరుగుబాటు నుంచి దృష్టి మరల్చేందుకు పాక్‌ ఈ దౌత్య వ్యూహాన్ని ఎంచుకున్నట్టుగా నిపుణులు చెబుతున్నారు. అయితే, గత నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్‌ రష్యా యుద్ధాన్ని ముగించడానికి మధ్యవర్తిగా ఎవరు వ్యవహరించాలనే దానిపై అంతర్జాతీయ వేదికలపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. అమెరికా జరిపిన శాంతి ప్రయత్నాలు పూర్తిగా నిలిచిపోవడంతో, ఇప్పుడు ఉక్రెయిన్ ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి యూరోపియన్ యూనియన్ సహాయాన్ని కోరుతోంది.

ఐరోపా వైపు చూస్తున్న ఉక్రెయిన్... తెరపైకి ప్రముఖుల పేర్లు

సైప్రస్‌లో ఈరోజు నుంచి ప్రారంభమైన ఐరోపా విదేశాంగ మంత్రుల రెండు రోజుల అనధికారిక సమావేశంలో ఈ అంశం ప్రధాన అజెండాగా మారింది. రష్యాతో చర్చల ప్రక్రియలో సరికొత్త వ్యూహాలను ప్రవేశపెట్టాలని ఉక్రెయిన్ భావిస్తోంది. ఈ శాంతి చర్చల దౌత్య బాధ్యతలను మోయగల సమర్థులైన రాయబారుల కోసం అన్వేషణ మొదలైంది. ఈ రేసులో ప్రధానంగా కొందరి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అందులో జర్మనీ మాజీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, ఇటలీ మాజీ ప్రధాని మారియో డ్రాగి, ఫిన్లాండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్బో పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, అలెగ్జాండర్‌ స్టబ్బో రష్యా కాల్పుల విరమణకు అంగీకరిస్తేనే బాధ్యతలు తీసుకుంటానని షరతు పెట్టారు. అయితే, రష్యా ప్రతిపాదనలు మరోలా ఉన్నాయి. జర్మనీ మాజీ ఛాన్సలర్‌ గెర్హార్డ్‌ శ్రోడర్‌ను రష్యా అధ్యక్షుడు ప్రతిపాదించాడు. శ్రోడర్‌కు రష్యా అనుకూలవాదిగా పేరుంది. ఈ నేపథ్యంలో ఈయూ విదేశాంగ విధాన చీఫ్‌ కాజా కల్లాస్‌ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.

రష్యా మొండితనం... ఐరోపా దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు

మరోవైపు, రష్యా మాత్రం యూరోపియన్ యూనియన్‌తో చర్చలకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తన హోదాకు తగినట్టుగా కేవలం అమెరికాతోనే మాట్లాడటానికి మొగ్గు చూపుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం ...ఫలితం లేని సుదీర్ఘ చర్చల ప్రక్రియలో భాగం కాలేము అని స్పష్టం చేశారు. అంతేకాదు, ఈయూ దేశాల మధ్య కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయం లేదు. స్వీడన్, లిథువేనియా వంటి దేశాలు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించి ఒత్తిడి పెంచాలని అంటుంటే, ఇటలీ వంటి దేశాలు మాత్రం త్వరగా మధ్యవర్తిత్వం ప్రారంభించాలని కోరుతున్నాయి.

యూరప్‌ కేవలం తటస్థ మధ్యవర్తిగా వస్తే రష్యా వినదు. రష్యాను లొంగదీసుకోవాలంటే యూరప్‌ తన శక్తిని ప్రదర్శించాల్సి ఉంటుంది అని ఉక్రెయిన్ విశ్లేషకుడు యారోస్లావ్ స్మోవ్జ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ డ్రోన్లతో రష్యా చమురు కేంద్రాలపై దాడులు చేస్తూ ఒత్తిడి పెంచుతోంది. ఇటు ఇరాన్ సంక్షోభంలో పాక్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, అటు ఉక్రెయిన్ సరిహద్దుల్లో శాంతిని పునరుద్ధరించే ఆ ‘మహా మధ్యవర్తి’ ఎవరో తేలడానికి మరికొంత కాలం పట్టేలా ఉంది. ఈ రెండు యుద్ధాలు వీలైనంత త్వరగా ఆగిపోతే...పూర్తిస్థాయిలో శాంతి ఒప్పందాలు కుదిరి ప్రపంచం మరలా పూర్వస్థితికి చేరుకోవడానికి కనీసం నెలరోజుల సమయం పడుతుందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story