USA: వంకర బుద్ధి చూపించిన అమెరికా.. భారతదేశ మ్యాప్ మార్చిన ఆ దేశ ర‌క్ష‌ణ శాఖ‌

USA: అమెరికా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2018లో "ఇండో-పసిఫిక్ కమాండ్" (USINDOPACOM)గా పేరు మార్చిన అమెరికా సైనిక కమాండ్‌.

Mokshith
Updated on: 17 Jun 2026 3:59 PM IST
USA
X

USA: వంకర బుద్ధి చూపించిన అమెరికా.. భారతదేశ మ్యాప్ మార్చిన ఆ దేశ ర‌క్ష‌ణ శాఖ‌

USA: అమెరికా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2018లో "ఇండో-పసిఫిక్ కమాండ్" (USINDOPACOM)గా పేరు మార్చిన అమెరికా సైనిక కమాండ్‌ను మళ్లీ దాని పాత పేరైన "యూఎస్ పసిఫిక్ కమాండ్" (USPACOM)గా మార్చుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం కేవలం పేరు మార్పు మాత్రమేనని, కమాండ్ పరిధి లేదా బాధ్యతల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో కమాండ్ వెబ్‌సైట్‌లో భారత్‌కు సంబంధించిన తప్పు మ్యాప్ కనిపించడం మరో వివాదానికి దారితీసింది.

భారత్ మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్

యూఎస్ పసిఫిక్ కమాండ్ అధికారిక వెబ్‌సైట్‌లోని "ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ" మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)ను పాకిస్థాన్‌లో భాగంగా చూపించినట్లు గుర్తించారు. ఇది భారత్‌లో చర్చకు దారితీసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ తన అంతర్భాగంగా పరిగణిస్తుండగా, అమెరికా కమాండ్ వెబ్‌సైట్‌లో కనిపించిన ఈ మ్యాప్‌పై పలు వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.






'ఇండో' తొలగింపున‌కు కారణం ఏంటి?

2018లో అప్పటి అమెరికా రక్షణ మంత్రి జిమ్ మ్యాటిస్, పసిఫిక్ కమాండ్ పేరును ఇండో-పసిఫిక్ కమాండ్‌గా మార్చారు. హిందూ మహాసముద్ర ప్రాంతం ప్రాధాన్యత పెరగడం, భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడటం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా పాత పేరును పునరుద్ధరిస్తూ, ఇది చారిత్రక వారసత్వాన్ని గౌరవించేందుకు తీసుకున్న చర్య మాత్రమేనని అమెరికా రక్షణ శాఖ తెలిపింది.

కమాండ్ బాధ్యతల్లో ఎలాంటి మార్పు లేదు

అమెరికా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, కమాండ్ పరిధి యథాతథంగానే కొనసాగుతుంది. అమెరికా పశ్చిమ తీర ప్రాంతం నుంచి భారత్ పశ్చిమ సరిహద్దుల వరకు విస్తరించిన విస్తారమైన ప్రాంతం ఈ కమాండ్ పరిధిలోనే ఉంటుంది. ఆసియా, పసిఫిక్, హిందూ మహాసముద్రం, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాల్లో భద్రతా వ్యవహారాలు, సైనిక విన్యాసాలు, సముద్ర భద్రత, విపత్తు సహాయక చర్యలు వంటి బాధ్యతలు ఇదే కమాండ్ నిర్వహిస్తుంది.

ఇండో-పసిఫిక్ వ్యూహంపై ప్రభావం ఉంటుందా?

పేరు మార్పు తర్వాత రాజకీయ, వ్యూహాత్మక వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల క్వాడ్ కూటమిపై దీని ప్రభావం ఉంటుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ "క్వాడ్‌కు మరో దెబ్బ‌ పడిందా?" అని వ్యాఖ్యానించారు. అయితే అమెరికా మాత్రం ఇది కేవలం నామమాత్రమైన మార్పేనని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తమ వ్యూహం, భాగస్వామ్యాలు, భద్రతా కట్టుబాట్లు యథాతథంగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది.

ప్రపంచ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న కమాండ్

1947 జనవరి 1న అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ కాలంలో స్థాపించిన‌ ఈ కమాండ్, అమెరికా సైన్యంలో అత్యంత పురాతనమైన యూనిఫైడ్ కంబాటెంట్ కమాండ్లలో ఒకటి. కొరియా యుద్ధం, వియత్నాం యుద్ధం వంటి కీలక ఘట్టాల్లో ఇది ప్రధాన పాత్ర పోషించింది. ప్రస్తుతం హవాయిలో ప్రధాన కార్యాలయం కలిగిన ఈ కమాండ్, ఆసియా-పసిఫిక్ ప్రాంత భద్రతా వ్యవస్థలో అత్యంత కీలకమైన కేంద్రంగా కొనసాగుతోంది.




Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story