Venezuela: అమెరికాతో చమురు డీల్‌పై వెనిజులాలో ఆగ్రహజ్వాలలు... అంతుచిక్కని వ్యూహం వెనుక రహస్యమేంటి?
అమెరికా-వెనిజులా భారీ చమురు డీల్‌పై దేశంలో వెనిజులా దేశంలో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. సరికొత్త వలసవాదానికి చిహ్నంగా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. దేశ సంపదను దోచుకోవడానికి అమెరికా ఎత్తులు వేస్తోందని మండిపడుతున్నారు.
Venezuela: అమెరికా ప్రభుత్వం వెనిజులాలోని మధ్యంతర ప్రభుత్వంతో కుదుర్చుకున్న భారీ చమురు ఒప్పందం పశ్చిమార్ధగోళ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. నికోలాస్ మదురోను అధికారంలో నుండి తొలగించిన అనంతరం, వెనిజులా చమురు సంపదను తమ నియంత్రణలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా వైట్ హౌస్ ఈ వ్యూహాత్మక డీల్‌ను ముందుకు తీసుకెళ్లింది. ప్రైవేట్ సంస్థ 'నార్త్ అమెరికన్ బ్లూ ఎనర్జీ పార్ట్‌నర్స్' నేతృత్వంలో కుదిరిన ఈ 100 ఏళ్ల లీజు ఒప్పందం ద్వారా దాదాపు 6,500 కోట్ల బారెళ్ల ముడి చమురు నిల్వలున్న 17 చమురు క్షేత్రాలు అమెరికా రక్షణ శాఖ ఆధిపత్యంలోకి వెళ్లనున్నాయి.
ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద చమురు డీల్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీనిని ప్రపంచ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఒప్పందంగా అభివర్ణించారు. ఈ ఒప్పందంలో భాగమైన NABEP మాతృ సంస్థలో అమెరికా ప్రభుత్వానికి ఉచితంగా 35 శాతం ఈక్విటీ భాగస్వామ్యం లభించింది. కంపెనీ ద్వారా ఉత్పత్తి అయ్యే చమురులో 20 శాతాన్ని తక్కువ ఉత్పత్తి వ్యయానికే కొనుగోలు చేసే హక్కు, మిగిలిన 80 శాతం ముడి చమురుపై మొదటి కొనుగోలు హక్కు వాషింగ్టన్ దక్కించుకుంది. అంతేకాదు, కంపెనీ యాజమాన్య బోర్డు సభ్యుల నియామకంలో అమెరికాకు వీటో అధికారం ఉండడమే కాకుండా, బోర్డులో మెజారిటీ సభ్యులు అమెరికన్ పౌరులే ఉండాలనే కఠిన నిబంధన విధించారు.
వెనిజులా ఆర్థిక వ్యవస్థ ... 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ఈ డీల్‌ను సమర్థిస్తూ, దీని ద్వారా దేశంలోకి 100 బిలియన్ డాలర్ల ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. రాబోయే కాలంలో దాదాపు 200 బిలియన్ డాలర్ల మేర పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని ఆమె వెల్లడించారు.అయితే, దశాబ్దాల తరబడి శిథిలావస్థకు చేరిన వెనిజులా చమురు మౌలిక సదుపాయాలను బాగు చేసి పూర్వ వైభవం తేడానికి కనీసం 8 నుండి 10 ఏళ్ల సమయం పడుతుందని ఇంధన రంగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఆగ్రహజ్వాలలు ... 'కొత్త వలసవాదం'పై విమర్శలు
ఈ ఒప్పందంపై వెనిజులా ప్రతిపక్షాలు, సమాజంలో అన్ని వర్గాల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించకుండా, అణచివేసే పాత పాలక వర్గంతోనే అమెరికా స్వార్థ ప్రయోజనాల కోసం జతకట్టిందని విపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. అంతేకాదు, 'మాన్రో సిద్ధాంతం' పేరుతో అమెరికా తమ దేశ సంపదలో 20 శాతాన్ని దోచుకుంటోందని, ఇది ఆధునిక వలసవాదానికి పరాకాష్ట అని వెనిజులా మాజీ చమురు మంత్రి రఫేల్ రామిరెజ్ ఆరోపించారు.
ఇరాన్ ఘర్షణల వల్ల ప్రపంచ చమురు ధరలు పెరిగిపోతున్న వేళ, పశ్చిమార్థగోళంలో నిల్వలను పెంచుకోవడం ద్వారా అమెరికా తన ఆర్థిక భద్రతను రక్షించుకోవాలని చూస్తోంది. అయితే, వెనిజులా సార్వభౌమత్వాన్ని పక్కనబెట్టి కుదుర్చుకున్న ఈ సుదీర్ఘ లీజు ఒప్పందం భవిష్యత్తులో ఏ మేరకు నిలబడుతుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. అయితే, ఈ డీల్‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో వెనిజులా తాత్కాలిక ప్రభుత్వం ఒత్తిడిని ఏ మేరకు తట్టుకోగలుగుతుందో కూడా చూడాలి.




