US Sanctions: ఇరాన్‌తో పాటు ఆ దేశాలపై కూడా ఆంక్షలు... అమెరికా సంచలన నిర్ణయం

ఉత్తర కొరియా తరహాలోనే ఇరాన్‌ను ఏకాకిని చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఆ దేశంతో వ్యాపారం చేసే సంస్థలు, దేశాలపై సెకండరీ ఆంక్షలు కొనసాగించేందుకు సిద్దమౌతున్నది.

Balachander
Published on: 26 Aug 2026 3:36 PM IST
US Sanctions: ఇరాన్‌తో పాటు ఆ దేశాలపై కూడా ఆంక్షలు... అమెరికా సంచలన నిర్ణయం
X

US Sanctions: ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం ద్వారా ఆ దేశాన్ని పూర్తిగా ఏకాకిని చేసేందుకు అమెరికా సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే ‘ఆపరేషన్ ఎకనామిక్ ప్యూరీ’ని నడుపుతున్న వాషింగ్టన్, ఇప్పుడు ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’ పేరుతో ద్వితీయ శ్రేణి ఆంక్షల కరవాలాన్ని ఝుళిపిస్తోంది. ఇరాన్‌తో వాణిజ్యం చేసే ఇతర దేశాలను కూడా లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త కఠిన నిర్ణయాన్ని వెలువరించింది. ఆసియా, ఐరోపా, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో ఇరాన్‌తో సంబంధాలు కలిగి ఉన్న కనీసం 60 సంస్థలు, షిప్పింగ్ కంపెనీలు, డిజిటల్ అసెట్స్, బంగారం, సాంకేతిక, విమానయాన రంగాలపై ఈ ఆంక్షలు విధించారు.

అసలేమిటీ 'ద్వితీయ శ్రేణి ఆంక్షలు'?

సాధారణంగా ఒక దేశంపై ఆంక్షలు విధిస్తే ప్రత్యక్షంగా ఆ దేశంతో లావాదేవీలను నిలిపివేస్తారు. కానీ ద్వితీయ శ్రేణి ఆంక్షల ప్రకారం ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంతో ఎవరైనా మూడో దేశం లేదా బ్యాంక్ వ్యాపారం జరిపితే, ఆ మూడో దేశపు సంస్థలపై కూడా అమెరికా కఠిన ఆంక్షలు విధిస్తుంది. అంటే, అమెరికా ఆర్థిక వ్యవస్థ లేదా డాలర్ క్లియరింగ్ సిస్టమ్‌తో సంబంధం ఉన్న ఏ అంతర్జాతీయ బ్యాంక్ అయినా ఇరాన్ చెల్లింపులను ప్రాసెస్ చేస్తే, ఆ బ్యాంక్‌పై అమెరికా వేటు వేస్తుంది. తద్వారా డాలర్‌తో వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్‌లో వ్యాపారం కోల్పోతామనే భయంతో గ్లోబల్ బ్యాంకులు, సంస్థలు ఇరాన్‌కు స్వచ్ఛందంగా దూరమౌతాయని అమెరికా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

దీనిపై అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ స్పందిస్తూ, "ఇరాన్‌తో లావాదేవీలు నడుపుతూ ఆ దేశ చమురును నిధులుగా మలిచే ప్రతి వ్యవస్థను అమెరికా టార్గెట్ చేస్తుంది" అని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలు అమెరికా వైపు ఉంటాయో లేక ఇరాన్‌కు మద్దతుగా ఉంటాయో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.

గతంలో ఇటువంటి ఆంక్షలు ఎప్పుడు విధించారు?

ఇరాన్, రష్యా, ఉత్తర కొరియాలను నిరోధించేందుకు అమెరికా తీసుకొచ్చిన 2017 CAATSA చట్టం ద్వారా 2018లో రష్యా నుంచి Su-35 యుద్ధ విమానాలు, S-400 మిస్సైళ్లు కొనుగోలు చేసినందుకు చైనా మిలిటరీ విభాగాన్ని అమెరికా ద్వితీయ ఆంక్షలతో దెబ్బతీసింది. అంతేకాదు, నాటో సభ్యదేశమైన టర్కీ, రష్యా వద్ద S-400 రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసినందుకు గాను ఆ దేశ రక్షణ సంస్థలపై అమెరికా CAATSA ఆంక్షలు విధించింది. ప్రస్తుతం ఈ ఆంక్షల ఎత్తివేతపై చర్చలు నడుస్తున్నాయి. ఈ చర్చలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

ఇరాన్ ప్రధాన భాగస్వామ్య దేశాలు ... ప్రభావం ఎలా ఉండబోతుంది?

2024 గణాంకాల ప్రకారం ఇరాన్ 112 దేశాలకు దాదాపు 56 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు చేయగా, 87 దేశాల నుంచి 68.5 బిలియన్ డాలర్ల దిగుమతులు చేసుకుంది. ఇరాన్‌కు ప్రధాన వాణిజ్య భాగస్వాములుగా చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టర్కీ, ఇరాక్, రష్యా, భారత్ ఉన్నాయి.

ఇక, విశ్లేషకుల అంచనా ప్రకారం, చైనా వంటి దేశాలు ఇరాన్ చమురు కొనుగోళ్లలో 80% వాటాను కలిగి ఉన్నాయి. డాలర్ రహిత వ్యవస్థల ద్వారా వ్యాపారం చేసే చైనా శుద్ధి కర్మాగారాలపై అమెరికా ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ, హోర్ముజ్ జలసంధి ముట్టడితో ప్రపంచ ఇంధన మార్కెట్, గ్లోబల్ సప్లై చైన్ ఇప్పటికే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుండగా, ఈ కొత్త ఆంక్షలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరింత అలజడి సృష్టిస్తున్నాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story