US-Iran War : యుద్ధంలో మారుతున్న సమీకరణాలు..ఇరాన్ దెబ్బకు అమెరికా విలవిల
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం వాటిల్లింది.
US-Iran War : యుద్ధంలో మారుతున్న సమీకరణాలు..ఇరాన్ దెబ్బకు అమెరికా విలవిల
US Military Base Strikes : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల ధాటికి అజేయమని భావించిన అమెరికా రక్షణ వ్యవస్థలు కకావికలమవుతున్నాయి. యుద్ధం మొదలైన కేవలం రెండు వారాల్లోనే అగ్రరాజ్యానికి 7,525 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు BBC, CSIS విశ్లేషిస్తున్నాయి.
రాడార్ వ్యవస్థ ధ్వంసం
ఈ యుద్ధంలో అమెరికాకు తగిలిన అతిపెద్ద దెబ్బ బూర్డాన్లోని అత్యంత శక్తివంతమైన థార్ రాడార్ వ్యవస్థ ధ్వంసం కావడం. శత్రు దేశాల క్షిపణులను గాలిలోనే గుర్తించి అడ్డుకునే ఈ అత్యాధునిక వ్యవస్థను ఇరాన్ డ్రోన్లు చాకచక్యంగా ఛేదించాయి. ఒక్క ఈ రాడార్ వ్యవస్థ నష్టమే సుమారు 4,000 కోట్ల రూపాయల పైచిలుకు ఉంటుందని అంచనా. అగ్రరాజ్యం గర్వంగా చెప్పుకునే డిఫెన్స్ షీల్డ్‌ను ఇరాన్ క్షిపణులు చిత్తు చేయడం ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తోంది.
ఆయుధాల సరఫరా నిలిపివేత
ఒకవైపు యుద్ధ క్షేత్రంలో ఆయుధాలు, ఆస్తులు ధ్వంసమవుతుంటే.. మరోవైపు దౌత్యపరంగా అమెరికాకు ఒంటరితనం ఎదురవుతోంది. తటస్థ దేశంగా గుర్తింపు పొందిన ఐరోపా దేశం స్విట్జర్లాండ్, అమెరికాకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్నంత కాలం అమెరికాకు ఎటువంటి ఆయుధాలను ఎగుమతి చేయబోమని స్విస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. యుద్ధంలో పాల్గొంటున్న ఏ దేశానికైనా ఆయుధాల ఎగుమతి లైసెన్సులు జారీ చేయలేం అని స్విట్జర్లాండ్ కుండబద్దలు కొట్టింది. యుద్ధ నియమాలను సాకుగా చూపిస్తూ, ఆయుధాల ఎగుమతిని నిషేధించడం అమెరికా రక్షణ వ్యూహాలకు పెద్ద అడ్డంకిగా మారింది. ఇప్పటికే ఆయుధ నిల్వలు తరిగిపోతున్న తరుణంలో, కీలక మిత్రదేశాల నుంచి అందుతున్న ఇలాంటి నిర్ణయాలు అమెరికాను ఆత్మరక్షణలో పడేశాయి.
మారిపోతున్న యుద్ధ సమీకరణాలు
ఇరాన్ ప్రయోగిస్తున్న తక్కువ ఖరీదైన డ్రోన్లు, అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేస్తుండటం గమనార్హం. పశ్చిమాసియాలోని అమెరికన్ మిలిటరీ బేస్‌లపై ఇరాన్ విరామం లేకుండా జరుపుతున్న వైమానిక దాడులు అగ్రరాజ్యం ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికా తన రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచుకోవాల్సి రావడమే కాకుండా, అంతర్జాతీయంగా తన ప్రాభవాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. శాంతి చర్చల కంటే ఆయుధాల గర్జనలే మిన్నంటుతున్న వేళ, అమెరికా ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇటు ఇరాన్ పట్టుదల, అటు మిత్రదేశాల సహాయ నిరాకరణ మధ్య అగ్రరాజ్యం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.




