US Iran War : ఇరాన్ ఎనర్జీ గ్రిడ్‌లు, వంతెనలపై అమెరికా బాంబుల వర్షం.. చౌబహార్ పోర్ట్ టవర్ నేలమట్టం

US Iran War : మిడిల్ ఈస్ట్‌లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. హోర్ముజ్ జలసంధిపై పట్టు కోసం ఇరుదేశాలు పరస్పరం క్షిపణులతో దాడులు చేసుకుంటున్నాయి.

CR Reddy
Published on: 18 July 2026 7:38 AM IST
US Iran War
X

US Iran War

US Iran War : మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. శుక్రవారం నాడు ఇరుదేశాలు ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుని దాడులను మరింత తీవ్రం చేశాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి పై పట్టు సాధించేందుకు జరుగుతున్న ఈ పోరులో, ఇరుపక్షాలు పరస్పరం సైనిక స్థావరాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను టార్గెట్ చేశాయి. ఇరాన్ ఆధీనంలోని కీలక ఇంధన కేంద్రాలు, వంతెనలపై అమెరికా వైమానిక దాడులు చేయగా.. ఇరాన్ సైతం వెనక్కి తగ్గకుండా మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా మిత్రదేశాలపై క్షిపణుల వర్షం కురిపించింది. గత నాలుగు నెలలుగా సాగుతున్న ఈ యుద్ధానికి తాత్కాలిక సడలింపులు ముగియడంతో పరిస్థితి మరింత చేయిదాటిపోయింది.

అమెరికన్ సెంట్రల్ కమాండ్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఇరాన్ సైనిక పటిష్టతను దెబ్బతీసేందుకు అమెరికా సైన్యం వరుసగా ఏడో రాత్రి కూడా వైమానిక దాడులు కొనసాగించింది. ఇరాన్ దక్షిణ ప్రాంతమైన హోర్మోజ్‌గన్ పరిధిలోని బందర్ ఖమీర్ నగరంలోని కీలక హైవేలు, రైల్వే వంతెనలను అమెరికా బాంబులతో ధ్వంసం చేసింది. ఇరాన్ ప్రధాన ఓడరేవు బందర్ అబ్బాస్‌కు, రాజధాని టెహ్రాన్‌కు మధ్య రవాణా లింకులను కట్ చేయడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. వీటితో పాటు, ఓమన్ గల్ఫ్ తీరంలో భారత్ సహకారంతో నడుస్తున్న ఇరాన్ కీలక చౌబహార్ పోర్ట్ పై అమెరికా దాడి చేయడంతో అక్కడి కమర్షియల్ షిప్ మానిటరింగ్ టవర్ నేలమట్టమైంది. ఈ దాడుల వల్ల విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో, దక్షిణ ప్రాంతాల్లో ప్రజలు కరెంట్ వాడకాన్ని తగ్గించుకోవాలని ఇరాన్ ఇంధన మంత్రిత్వ శాఖ అత్యవసర ప్రకటన చేసింది.

హిట్‌బ్యాక్ ఇచ్చిన ఇరాన్

అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలైన ఖతార్, కువైట్, బహ్రెయిన్‌లను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించింది. ఈ యుద్ధంలో దౌత్యపరమైన మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్ దేశంపై ఇరాన్ రెండుసార్లు మిసైల్ దాడులు చేయడంతో అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ రంగంలోకి దిగాయి. మిసైల్ శిథిలాలు పడటంతో ఖతార్‌లో ఒక చిన్నారి గాయపడినట్లు అక్కడి అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. అటు కువైట్ దేశాన్ని కూడా ఇరాన్ గట్టిగా దెబ్బకొట్టింది. కువైట్‌లోని ప్రధాన విద్యుత్, వాటర్ డిసాలినేషన్ ప్లాంట్ పై ఇరాన్ క్షిపణులు పడటంతో ఆ ప్లాంట్ తీవ్రంగా దెబ్బతింది. కువైట్ దేశానికి అవసరమైన 90 శాతం తాగునీరు ఈ ప్లాంట్ నుంచే సరఫరా అవుతుండటంతో అక్కడ తాగునీటి సంక్షోభం తలెత్తే ప్రమాదం ఏర్పడింది.

తగ్గేదే లేదంటున్న డోనాల్డ్ ట్రంప్

ఈ యుద్ధ వాతావరణంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ విషయంలో తాము ఆశించిన రీతిలోనే ముందడుగు వేస్తున్నామని, ఈ పోరులో అమెరికాకు పెద్ద విజయం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే సుదీర్ఘ కాలం పాటు సాగే యుద్ధాలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేసిన ట్రంప్‌పై, ఈ సంక్షోభాన్ని త్వరగా ముగించాలనే అంతర్గత రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై చర్యలు ప్రారంభించినప్పటి నుంచి ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా బ్యారెల్‌కు 86 డాలర్ల పైకి ఎగబాకి నెల రోజుల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

ఇరాక్ సరిహద్దుల్లోనూ భారీ పేలుళ్లు

ఈ అమెరికా-ఇరాన్ దాడుల పరంపరలో ఇరుపక్షాల్లోనూ భారీగా ప్రాణనష్టం సంభవిస్తోంది. శుక్రవారం జరిగిన దాడులతో కలిపి ఇటీవలి కాలంలో కనీసం 46 మంది ఇరాన్ పౌరులు, సైనికులు మరణించగా, 400 మందికి పైగా గాయపడ్డారు. అమెరికా సైన్యంలో కూడా ఈ వారంలోనే 13 మంది సైనికులు గాయపడ్డారు. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు 14 మంది అమెరికా సైనికులు మరణించారు. ఇదిలా ఉండగా, ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని స్వయంప్రతిపత్తి గల కుర్దిష్ రీజియన్ పరిధిలోని ఎర్బిల్, సులేమానియా నగరాల్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుళ్లు సంభవించాయి. అక్కడ ఉన్న కోమలా అనే ఇరానీ కుర్దిష్ తిరుగుబాటు గ్రూపును లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడులలో కనీసం తొమ్మిది మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. జొర్డాన్ సరిహద్దుల్లోకి దూసుకొచ్చిన మరో మూడు ఇరాన్ మిసైళ్లను జొర్డాన్ ఆర్మీ గాల్లోనే పేల్చివేసింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story