US-Iran Tensions : డొనాల్డ్ ట్రంప్ టీమ్‌తో డైరెక్ట్ టాక్స్ నో.. సీజ్‌ఫైర్ రూల్స్ బ్రేక్ చేస్తే యుద్ధానికి సై అన్న ఇరాన్

US-Iran Tensions : అమెరికాతో చర్చలకు ఇరాన్ నిరాకరించడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హోర్ముజ్ జలసంధిపై టోల్ వసూలు చేస్తామని ఇరాన్ హెచ్చరించగా, అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

CR Reddy
Published on: 1 July 2026 9:34 AM IST
US-Iran Tensions
X

US-Iran Tensions 

US-Iran Tensions : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందనుకున్న తరుణంలో అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర కుదుపు చోటుచేసుకుంది. అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. దీంతో ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతి ఒప్పందం కుదురుతుందన్న ఆశలకు పెద్ద గండి పడింది. రెండు వారాల క్రితం కుదిరిన సీజ్‌ఫైర్ షరతులను అమెరికా పూర్తిగా అమలు చేయాలని, ఆ తర్వాతే అణు కార్యక్రమాలపై తదుపరి చర్చలు ఉంటాయని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రస్తుత అవగాహన ఒప్పందం ప్రకారం.. ఇరాన్ హోర్ముజ్ జలసంధిలో తన కఠిన నిబంధనలను సడలిస్తే, దానికి బదులుగా అమెరికా ఆర్థిక ఆంక్షల నుంచి ఉపశమనం కలిగించాల్సి ఉంటుంది. ఈ విషయాలపై 60 రోజుల పాటు చర్చలు జరిపి శాశ్వత పరిష్కారం వెతకాలని భావించినప్పటికీ, ఇరాన్ తాజా నిర్ణయంతో ఉద్రిక్తతలు మళ్లీ మొదటికి వచ్చాయి.

మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, యూఎస్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ అత్యున్నత స్థాయి చర్చల కోసం ఖతార్ రాజధాని దోహా చేరుకున్నారు. ఈ భేటీని వైట్ హౌస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివర్ణించినప్పటికీ, ఇరాన్ మాత్రం తాము అమెరికా ప్రతినిధులతో ఒకే టేబుల్‌పై కూర్చోబోమని స్పష్టం చేసింది. చర్చలు ఏవైనా ఉంటే కేవలం మధ్యవర్తుల ద్వారానే సాగుతాయని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతిప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ స్పష్టం చేశారు. వచ్చే కొన్ని రోజుల్లో అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష సమావేశాలు ఉండబోవని ఆయన తేల్చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కేవలం టెక్నికల్ లెవెల్ చర్చలు మాత్రమే ప్రారంభం కావచ్చని కతార్ విదేశాంగ శాఖ పేర్కొంది.

హోర్ముజ్ జలసంధిలో టోల్ వసూలు చేస్తాం

ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, శాంతి చర్చల ముఖ్య సంధానకర్త మహ్మద్ బఘేర్ గాలిబాఫ్ హోర్ముజ్ జలసంధిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా గనుక సీజ్‌ఫైర్ నిబంధనలను పాటించకపోతే తాము యుద్ధానికి కూడా సిద్ధమేనని ఆయన హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్, ఒమన్‌ దేశాలకు పూర్తి హక్కులు ఉన్నాయని, ఈ మార్గం గుండా వెళ్లే నౌకలు తమ రూల్స్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం కేవలం 60 రోజుల వరకు మాత్రమే నౌకల నుండి ఎటువంటి రుసుము వసూలు చేయమని, ఆ గడువు ముగిసిన తర్వాత ప్రతి ఓడ నుంచి టోల్ వసూలు చేస్తామని ప్రకటించారు. హోర్ముజ్ జలసంధి ఇరాన్ యొక్క అతిపెద్ద బలమని, ఏ ధర చెల్లించైనా తమ హక్కులను కాపాడుకుంటామని గాలిబాఫ్ వ్యాఖ్యానించారు.

తీవ్రంగా ఖండించిన అమెరికా

ఇరాన్ టోల్ ప్రతిపాదనను అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతర్జాతీయ జలమార్గాన వెళ్లే నౌకల నుంచి ఇరాన్ టోల్ వసూలు చేయడాన్ని అమెరికా ఏమాత్రం సహించబోదని ఆయన కౌంటర్ ఇచ్చారు. యుద్ధం కారణంగా దెబ్బతిన్న హోర్ముజ్ మార్గంలో ప్రస్తుతం చమురు సరఫరా మళ్లీ సాధారణ స్థితికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కాగా ఇరాన్ మొండివైఖరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం సీరియస్ అయినట్లు సమాచారం. అవసరమైతే ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్యలు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్, ఆర్మీ ఉన్నతాధికారులతో ట్రంప్ చర్చలు జరిపినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అయితే, ప్రస్తుతానికి మిలిటరీ యాక్షన్ కంటే దౌత్యపరమైన చర్చలకే మరికొంత సమయం ఇవ్వాలని ట్రంప్ నిర్ణయించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story