ఓడరేవుల దిగ్భంధనం దీర్ఘకాలికం...అమెరికాకు హార్ట్‌ఎటాక్‌ తెప్పించే దాడికి సిద్దం

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ మధ్య సాగుతున్న ఈ 'మైండ్ గేమ్' ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేరుకుంది.

Balachander
Published on: 30 April 2026 11:41 AM IST
ఓడరేవుల దిగ్భంధనం దీర్ఘకాలికం...అమెరికాకు హార్ట్‌ఎటాక్‌ తెప్పించే దాడికి సిద్దం
X

US Iran Tensions: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ మధ్య సాగుతున్న ఈ 'మైండ్ గేమ్' ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇరాన్ ఓడరేవులను దీర్ఘకాలం పాటు దిగ్బంధించి, ఆ దేశాన్ని ఆర్థికంగా నిర్వీర్యం చేయాలని ట్రంప్ మాస్టర్ ప్లాన్ వేస్తుండగా, ఇరాన్ మాత్రం అమెరికాకు 'హార్ట్ ఎటాక్' తెప్పించే కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తామంటూ సంచలన హెచ్చరికలు జారీ చేసింది. ఈ మైండ్‌ గేమ్‌లో విజయం ఎవరిని వరిస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరం.

ట్రంప్ వ్యూహం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్‌ అణు కార్యక్రమాలకు చెక్‌ పెట్టాలంటే కేవలం సైనిక చర్యలు మాత్రమే సరిపోవని, ఆ దేశ ఓడరేవులను పూర్తిగా దిగ్భంధించి ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేయడమే ఏకైకమార్గమని ట్రంప్‌ నమ్ముతున్నారు. ఈ దిగ్భంధం కూడా దీర్ఘకాలంపాటు కొనసాగించాలని చూస్తున్నారు. ఇకపై తాను మంచివాడిగా ఉండబోనని చెబుతూ ట్రంప్‌ రైఫిల్‌ పట్టుకున్న ఫొటోను తన ట్రంప్‌ ట్రూత్‌లో పోస్ట్‌ చేశాడు. ఇలా ఇరాన్‌ను హెచ్చరిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా ఈ విషయంపై ట్రంప్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సుదీర్ఘంగా గంటన్నరపాటు ఫోన్‌చేసి మాట్లాడారు. ఇరాన్‌ను మిత్రదేశంగా రష్యా గుర్తించడమే దీనికి కారణంగా కూడా చెప్పవచ్చు. ఒకవేళ ఇరాన్‌పై తీసుకుంటున్న చర్యలను రష్యా వ్యతిరేకిస్తే దాని వలన అమెరికాకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇరాన్ ప్రతీకారం- 'ఆ ఆయుధం మీ పక్కనే ఉంది!'

ఇక అమెరికా చేసిన హెచ్చరికలను ఇరాన్‌ ఖండించింది. అంతేకాకుండా అమెరికాకు షాకిచ్చే వార్తను బయటపెట్టింది. శత్రు బలగాల గుండెల్లో వణుకుపుట్టించే కొత్త ఆయుధాన్ని త్వరలోనే బయటకు తీస్తామని ఇరాన్‌ నేవీ కమాండర్‌ రేర్‌ అడ్మిరల్‌ షారమ్‌ ఇరానీ పేర్కొన్నారు. అయితే, ఈ రహస్య ఆయుధం అమెరికా నౌకల పక్కనే ఉందని, దాని దెబ్బకు వారికి గుండెపోటు రావడం ఖాయమని హెచ్చరించారు. కానీ, ఈ రహస్య ఆయుధం ఏంటన్నది ఇరాన్‌ బయటపెట్టడం లేదు. దీంతో పశ్చిమాసియాలోని హోర్ముజ్‌ జలసంధిలో తిష్టవేసిన అమెరికా నౌకల్లో కొంత గందరగోళం నెలకొన్నది. ఇరాన్‌ను తక్కువగా అంచనా వేయవద్దని ఇప్పటికే అంతర్జాతీయ యద్ధనిపుణులు చెబుతున్నారు. ఇక అమెరికా యుద్ధ వాహకనౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్‌పై 7 క్షిపణులతో విరుచుకుపడ్డామని, శతృవు పశ్చాత్తాపం చెందే వరకు తమ పోరాటం ఆగదని అడ్మిరల్‌ తెలిపారు.

వ్యూహాత్మక పోరు: హర్మూజ్ జలసంధి

ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి ఇప్పుడు ఈ పోరాటానికి కేంద్రబిందువుగా మారింది. దిగ్బంధనం ఎత్తివేస్తేనే ఈ మార్గాన్ని తెరుస్తామని ఇరాన్ అంటుంటే, అణు ఒప్పందం కుదిరే వరకు రాజీ పడే ప్రసక్తే లేదని ట్రంప్ భీష్మించుకుని కూర్చున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

మొత్తంగా చెప్పాలంటే ఒకవైపు ఆర్థిక దిగ్బంధనం, మరోవైపు రహస్య ఆయుధాల హెచ్చరికల మధ్య పశ్చిమాసియా అగ్నిగుండంలా మారింది. సైనిక చర్య కంటే ఓడరేవుల దిగ్బంధనమే ప్రభావవంతంగా ఉందని ట్రంప్ భావిస్తుంటే, ఇరాన్ మాత్రం తన చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తోంది. ఈ రెండు దేశాల పంతం ప్రపంచ దేశాలను ఆందోళనలోకి నెట్టేస్తోంది. మరి ఈ ఉద్రిక్తతలు శాంతి వైపు వెళ్తాయా లేక పెను యుద్ధానికి దారితీస్తాయా అనేది వేచి చూడాలి. ఇప్పటికైతే వేచి ఉండటం తప్ప ఎవరూ ఏం చేయలేరు. రోజులు గడిచేకొలది చమురు కష్టాలు పెరగడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story