US-Iran Conflict : మళ్లీ రగులుకున్న మంటలు... మధ్యప్రాచ్యం మనుగడ కష్టమే

అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ దాడులు తీవ్రతరం కావడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హోర్ముజ్ జలసంధి, ఇంధన సరఫరా, ఆర్థిక సంక్షోభంపై ప్రభావాన్ని తెలుసుకుందాం.

Balachander
Published on: 31 Aug 2026 11:29 AM IST
US-Iran Conflict : మళ్లీ రగులుకున్న మంటలు... మధ్యప్రాచ్యం మనుగడ కష్టమే
X

US-Iran Conflict : మధ్యప్రాచ్యంలో నెలకు పైగా నెలకొన్న తాత్కాలిక ప్రశాంతతకు తెరపడి, అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య దాడులు-ప్రతీకార దాడులతో యుద్ధజ్వాలలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్ తీరంలోని లారక్ దీవిపై అమెరికా జరిపిన డ్రోన్ దాడులతో ప్రారంభమైన ఈ తాజా ఉద్రిక్తతలు, ఇరాన్ క్షిపణి ప్రతిదాడితో సముద్ర సరిహద్దులను దాటి పొరుగున ఉన్న జోర్డాన్‌కూ వ్యాపించాయి. ఆరు నెలల కాలాన్ని పూర్తి చేసుకున్న ఈ ఇరాన్ యుద్ధ సంక్షోభంలో చోటుచేసుకున్న ఈ కొత్త పరిణామాలు, అంతర్జాతీయ ఇంధన భద్రతను, మధ్యప్రాచ్య ప్రాంత మనుగడనే తీవ్ర ముప్పులోకి నెడుతున్నాయి. ఈ తాజా దాడుల వెనుక ఉన్న వ్యూహాత్మక కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

లారక్ దీవిపై దాడి ... హార్ముజ్ జలసంధి సమీకరణాలు

హోర్ముజ్ జలసంధిలోని కీలకమైన బందర్ అబ్బాస్ నౌకాశ్రయానికి సమీపంలో ఉన్న లారక్ దీవి వద్ద ఇరాన్ మైన్ లేయింగ్ బలగాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సెంట్రల్ కమాండ్ దాడులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు మంది మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని ఇరాన్ ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ధృవీకరించింది. అమెరికాకు చెందిన డ్రోన్‌ను తాము కూల్చివేశామని ఇరాన్ ప్రకటించగా, హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి ఇరాన్ 2 మిలియన్ డాలర్ల అంటే రూ. 16 కోట్లకు పైగా రుసుము వసూలు చేస్తోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి వర్షం

లారక్ దీవిపై దాడికి ప్రతీకారంగా ఇరాన్ తన సైనిక చర్యను వేగవంతం చేసింది. జోర్డాన్‌లోని అమెరికాకు చెందిన 'కింగ్ హుస్సేన్', 'అల్-అజ్రాక్' సైనిక స్థావరాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల ద్వారా ఎనిమిది క్షిపణులను అడ్డుకున్నట్లు జోర్డాన్ సైన్యం ప్రకటించినప్పటికీ, అమెరికా యుద్ధ విమానాల స్థావరాలు, సాంకేతిక మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లిందని ఇరాన్ పేర్కొంది.

ఇంధన సంక్షోభం ... ఆర్థిక దిగ్బంధం

ప్రపంచ చమురు, ద్రవీకృత సహజ వాయువు సరఫరాలో 20 శాతం కంటే ఎక్కువ వాటా కలిగిన హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు స్తంభించడంతో అంతర్జాతీయ మార్కెట్ కుదేలవుతోంది. ఆగస్టు 24న ఇరాన్‌పై అమెరికా విధించిన కొత్త ఆర్థిక ఆంక్షలు తీవ్ర ఒత్తిడిని పెంచాయి. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందిస్తూ, తమకు యుద్ధం కావాలో వద్దో అనేది ముఖ్యం కాదని, తమ భూభాగంపై జరిగే ఏ దాడికైనా గట్టి సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. ఆరు నెలలుగా జరుగుతున్న ఈ పోరు శత్రుత్వానికే పరిమితం కాకుండా, గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్‌ను దెబ్బతీస్తూ సామాన్య ప్రజలపై విపరీతమైన ధరల భారాన్ని మోపుతోంది. దౌత్యపరమైన చర్చలు విఫలమైతే మధ్యప్రాచ్య ఆర్థిక వ్యవస్థ తీవ్ర వినాశనాన్ని ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story