Donald Trump : ట్రంప్ విధానాలపై తిరగబడ్డ సొంత పార్టీ ఎంపీలు.. ఇరాన్ పై యుద్ధానికి బ్రేక్ వేస్తూ తీర్మానం!
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధ అధికారాలను పరిమితం చేస్తూ యూఎస్ ప్రతినిధుల సభ తీర్మానం ఆమోదించింది. సొంత రిపబ్లికన్ పార్టీ ఎంపీలు కూడా దీనికి మద్దతు ఇవ్వడం విశేషం.
Donald Trump
Donald Trump : ఇరాన్ దేశంతో నడుస్తున్న యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌లో సైనిక చర్యలు చేపట్టే విషయంలో అధ్యక్షుడికి ఉన్న అధికారాలను పరిమితం చేస్తూ అమెరికా పార్లమెంట్ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ నిర్ణయం ట్రంప్ ఇరాన్ విధానాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించనుంది. అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ ఓటింగ్‌లో ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు కూడా పార్టీ లైన్ దాటి ప్రతిపక్ష డెమొక్రాట్లతో చేతులు కలిపారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 208 ఓట్లు పడ్డాయి.
పెరిగిన ధరలపై రిపబ్లికన్ ఎంపీల తిరుగుబాటు
రిపబ్లికన్ పార్టీకి చెందిన థామస్ మాస్సీ, బ్రయాన్ ఫిట్జ్‌ప్యాట్రిక్, టామ్ బారెట్, వారెన్ డేవిడ్‌సన్ వంటి కీలక ఎంపీలు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తమ ప్రాంత ప్రజలు ఈ సుదీర్ఘ యుద్ధం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ టామ్ బారెట్ బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. యుద్ధం కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం, ఆర్థిక సమస్యలు పెరిగిపోయాయని మండిపడ్డారు. మరో ఎంపీ థామస్ మాస్సీ మాట్లాడుతూ.. యుద్ధ ప్రభావంతో దేశంలో పెట్రోల్, డీజిల్, వ్యవసాయ ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయని, ఈ ఓటింగ్ ద్వారా ప్రజలు, పార్లమెంట్ ఇద్దరూ కూడా ఈ అనవసరపు యుద్ధంతో విసిగిపోయారనే విషయం స్పష్టమైందని అన్నారు.
వార్ పవర్స్ యాక్ట్‌ను ఉల్లంఘించారనే ఆరోపణలు
న్యూయార్క్‌కు చెందిన డెమొక్రాట్ ఎంపీ గ్రెగొరీ మీక్స్ ఈ తీర్మానాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అమెరికా రాజ్యాంగంలోని వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం.. దేశాధ్యక్షుడు యుద్ధం లాంటి పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా పార్లమెంట్ అనుమతి పొందాలని ఎంపీ బ్రయాన్ ఫిట్జ్‌ప్యాట్రిక్ గుర్తుచేశారు. ఇలాంటి అంతర్జాతీయ సమస్యలపై పార్లమెంట్‌లో బహిరంగ చర్చ జరిగి ఓటింగ్ నిర్వహించాలన్నారు. ప్రభుత్వం తన పరిధిని దాటి ప్రవర్తించకుండా నిఘా పెట్టడమే పార్లమెంట్ ముఖ్య ఉద్దేశమని తీర్మానం నెగ్గిన అనంతరం గ్రెగొరీ మీక్స్ స్పష్టం చేశారు.
ట్రంప్ చర్యలపై పెంటగాన్ విచారణ
అయితే ఈ తీర్మానాన్ని హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయం వల్ల ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న శాంతి చర్చలు, దౌత్యపరమైన ప్రయత్నాలు బలహీనపడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌లో అమెరికా అనుకున్న సైనిక లక్ష్యాలన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని, ప్రస్తుతం ట్రంప్ ఒక శాంతి ఒప్పందం వైపు అడుగులు వేస్తున్నారని ఆయన సమర్థించుకున్నారు. కానీ ఈ లోపే అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్), విదేశాంగ శాఖ యూఎస్ఏఐడీ (USAID) ఇన్స్‌పెక్టర్ జనరల్స్ ఇరాన్ యుద్ధానికి సంబంధించిన నిబంధనల ఉల్లంఘనలపై ఉమ్మడి దర్యాప్తును ప్రారంభించడం సంచలనంగా మారింది.
60 రోజుల గడువు దాటడమే వివాదానికి కారణం
అమెరికా చట్టాల ప్రకారం విదేశాల్లో 60 రోజుల కంటే ఎక్కువ కాలం పాటు సైనిక చర్యలు కొనసాగించాలంటే పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. దర్యాప్తు సంస్థల అంచనా ప్రకారం.. అమెరికా ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌లో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో సైనిక ప్రచారాన్ని నడుపుతోంది. దీని కాలపరిమితి ఇప్పటికే 60 రోజుల గడువును దాటేసింది. అయినా ట్రంప్ సర్కార్ పార్లమెంట్ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదు. ఇప్పుడు ఆమోదించిన ఈ కొత్త తీర్మానం తదుపరి ఆమోదం కోసం సెనెట్‌కు వెళ్లనుంది. ఇది నేరుగా చట్టంగా మారకపోయినప్పటికీ, ట్రంప్ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా, దేశీయంగా రాజకీయ మరియు చట్టపరమైన ఒత్తిడిని భారీగా పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.




