US Debt: అమెరికా చరిత్రలో తొలిసారి... ఆర్థిక సంక్షోభం దిశగా అగ్రరాజ్యం?

అమెరికా అప్పులు తీవ్రస్థాయిలో పెరిగిపోతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. రికార్డు స్థాయిలో రుణసంక్షోభంలోకి జారిపోయిందని యూఎస్‌ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.

Balachander
Published on: 20 Aug 2026 9:05 AM IST
US Debt: అమెరికా చరిత్రలో తొలిసారి... ఆర్థిక సంక్షోభం దిశగా అగ్రరాజ్యం?
X

US Debt: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బాస్ అని చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక రికార్డు స్థాయి రుణ సంక్షోభంలోకి జారిపోతోంది. యుఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం అమెరికా మొత్తం జాతీయ అప్పు 40.05 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం సంపాదించే రాబడి కంటే చేసే ఖర్చు విపరీతంగా పెరిగిపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం.

అమెరికా అప్పుల భారం ఎందుకింతలా పెరిగింది?

ఒక వైపు దేశీయంగా సోషల్ సెక్యూరిటీ, హెల్త్‌కేర్ విభాగాలకు దీర్ఘకాలికంగా నిధులు కేటాయించాల్సి రావడం, మరోవైపు విదేశాలలో ముదిరిన యుద్ధాలు అమెరికా ఖజానాపై తీవ్రమైన భారాన్ని మోపాయి. దీనికి తోడు పన్ను కోతలు కూడా ప్రభుత్వం ఆదాయాన్ని గండికొట్టాయి. సాధారణంగా శాంతియుతంగా, ఆర్థికంగా వృద్ధి చెందుతున్న సమయాల్లో కూడా అమెరికా ఏటా 2 ట్రిలియన్ డాలర్ల లోటు బడ్జెట్‌తో నడుస్తోందని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ ప్రతినిధి జెస్సికా రీడల్ పేర్కొన్నారు.

వడ్డీ రేట్ల దెబ్బ ... సామాన్యుడిపై ప్రభావం

గతంలో ఎప్పుడో 2007లో కనిపించిన స్థాయిలో ట్రెజరీ బాండ్ల వడ్డీ రేట్లు మళ్లీ గరిష్ఠ స్థాయికి పెరిగాయి. పాత అప్పులను రీఫైనాన్స్ చేసుకోవడానికి అమెరికా ప్రభుత్వం మరింత ఎక్కువ వడ్డీలకు రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ ప్రభావం కేవలం ఆ దేశ ప్రభుత్వంపైనే కాదు, అక్కడ వ్యాపారాలు చేసే సంస్థలతో పాటు సామాన్య ప్రజలపై కూడా పడుతుంది. భవిష్యత్తులో గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యాపార రుణాలు మరింత భారం కానున్నాయి.

ఇది నిజంగానే పెద్ద ఆర్థిక సంక్షోభమా?

అప్పుల మొత్తం 40 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటడం అనేది ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది తక్షణమే ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చకపోయినా, అమెరికా భవిష్యత్తుకు ఒక ముందస్తు హెచ్చరిక లాంటిదని చెబుతున్నారు. కాంగ్రెస్ అలాగే వరుసగా వచ్చిన ప్రభుత్వాలు దేశ వ్యయాలను అదుపు చేయడంలో సరైన వ్యూహాన్ని పాటించకపోవడమే ఈ పరిస్థితికి దారితీసింది. ఫెడరల్ లోటును 3 శాతానికి తగ్గించాలని అమెరికా ట్రెజరీ యోచిస్తున్నప్పటికీ, ఈ భారీ అప్పుల కొండను దాటడం వాషింగ్టన్‌కు అతిపెద్ద సవాలుగా మారింది. మరి పెరిగిపోతున్న అప్పులను అమెరికా ఏ విధంగా కంట్రోల్‌ చేస్తుందో చూడాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story