US China Trade War: అమెరికాకు చైనా బిగ్ షాక్.. ట్రంప్ పర్యటన ముగిసిన నెలకే ట్రేడ్ వార్..

US China Trade War: చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది.

Arun Chilukuri
Published on: 22 Jun 2026 12:37 PM IST
US China Trade War
X

US China Trade War: అమెరికాకు చైనా బిగ్ షాక్.. ట్రంప్ పర్యటన ముగిసిన నెలకే ట్రేడ్ వార్..

US China Trade War: ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మధ్య రక్షణ మరియు వాణిజ్య రంగాల్లో ఉద్రిక్తతలు మరోసారి గరిష్ట స్థాయికి చేరాయి. తమ దేశానికి చెందిన టెక్ దిగ్గజాలపై అమెరికా నిషేధం విధించినందుకు ప్రతిచర్యగా.. చైనా ప్రభుత్వం అమెరికాకు చెందిన 10 ప్రముఖ సైనిక సంబంధిత (Defense) కంపెనీలపై ఆంక్షలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంక్షలకు గురైన అమెరికా రక్షణ సంస్థలకు పౌర-మిలిటరీ వినియోగ వస్తువుల (Dual-use goods) ఎగుమతిని పూర్తిగా నిషేధించారు. ఈ జాబితాలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన రక్షణ రంగ కాంట్రాక్టర్లు రేథియాన్ (Raytheon), లాక్‌హీడ్ మార్టిన్ (Lockheed Martin) వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి.

దీనితో పాటు, అమెరికాకు చెందిన మరో 46 కంపెనీల నుంచి ఎలాంటి ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా చైనాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థలను (State-owned enterprises) నిరోధించనున్నట్లు బీజింగ్ స్పష్టం చేసింది.

చైనా తన ఆంక్షలను మరింత కఠినతరం చేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాలు ఎవరైనా చైనా నుంచి కొనుగోలు చేసిన వస్తువులను లేదా సాంకేతికతను.. ఈ ఆంక్షల జాబితాలో ఉన్న అమెరికా కంపెనీలకు బదిలీ (Transfer) చేయడాన్ని కూడా పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ నెల ఆరంభంలో అమెరికా రక్షణ శాఖ (Pentagon) చైనా సైన్యంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో.. చైనాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజాలు అలీబాబా (Alibaba), బైడూ (Baidu) సహా పలు కంపెనీలపై నిషేధం విధించింది. ఇకపై ఆయా చైనా కంపెనీలు అమెరికా సైనిక కాంట్రాక్టులను పొందలేవని స్పష్టం చేసింది. అగ్రరాజ్యం తీసుకున్న ఈ నిర్ణయానికి కౌంటర్‌గానే బీజింగ్ ఇప్పుడు అమెరికా రక్షణ సంస్థలను లక్ష్యంగా చేసుకుంది.

గత మే నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటించి, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య పరస్పర వాణిజ్య సహకారంపై ఇరు నేతలు ఒక అంగీకారానికి వచ్చారు. అయితే, ఆ పర్యటన ముగిసి నెల తిరక్కుండానే అమెరికా చైనా కంపెనీలను బ్యాన్ చేయడం, దానికి ప్రతిగా చైనా కూడా అమెరికా రక్షణ రంగ సంస్థలపై ఆర్థిక మరియు ఎగుమతి ఆంక్షలు విధించడంతో ఇరు దేశాల మధ్య 'ట్రేడ్ వార్' (Trade War) మళ్లీ మొదటికి వచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story