అమెరికా స్టూడెంట్ వీసాలపై ట్రంప్ షాక్.. ఇక 4 ఏళ్లే గడువు
అమెరికా స్టూడెంట్, ఎక్స్చేంజ్, జర్నలిస్టు వీసాలకు 4 ఏళ్ల గడువు విధించింది. కొత్త నిబంధనలు భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనున్నాయి.
US Caps Student Visas at 4 Years, Big Impact on Indians
అమెరికాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు భారీ షాక్ తగిలింది. విదేశీ విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు, జర్నలిస్టులకు జారీ చేసే నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా నిబంధనలను అమెరికా ప్రభుత్వం కఠినతరం చేసింది. ఇప్పటివరకు విద్యా కోర్సు పూర్తయ్యే వరకు అమల్లో ఉండే విధానాన్ని రద్దు చేస్తూ, ఇకపై గరిష్టంగా నాలుగు సంవత్సరాలపాటు మాత్రమే వీసా చెల్లుబాటు అయ్యేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ప్రకటించిన తాజా నిబంధనల ప్రకారం F (స్టూడెంట్), J (ఎక్స్చేంజ్ విజిటర్), I (జర్నలిస్టు) వీసా కేటగిరీలకు ఇకపై నిర్దిష్ట కాలపరిమితి అమల్లోకి రానుంది.
ప్రస్తుతం విద్యార్థులు తమ కోర్సు వ్యవధితో పాటు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ద్వారా చదువు పూర్తైన తర్వాత కూడా గరిష్టంగా మూడు సంవత్సరాల వరకు అమెరికాలో ఉండే అవకాశం ఉంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం F, J వీసా హోల్డర్లకు గరిష్టంగా నాలుగేళ్ల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంతకంటే ఎక్కువ కాలం చదువు కొనసాగించాల్సి వస్తే, అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (USCIS)కు ప్రత్యేకంగా ఎక్స్‌టెన్షన్ ఆఫ్ స్టే కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
అలాగే చదువు పూర్తైన తర్వాత ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను 30 రోజులకు కుదించారు. ఈలోపు విద్యార్థులు దేశం విడిచిపోవడం, మరో విద్యాసంస్థకు మారడం లేదా వీసా హోదా మార్చుకోవడం తప్పనిసరి.
ఇక జర్నలిస్టులకు ఇచ్చే I వీసా గరిష్ట కాలపరిమితిని 240 రోజులకు పరిమితం చేశారు. చైనా పౌరుల విషయంలో ఈ గడువు 90 రోజులు మాత్రమే ఉంటుంది.
హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ప్రకారం, ఈ మార్పులు వీసా దుర్వినియోగాన్ని అరికట్టడం, వలస వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడం, జాతీయ భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా తీసుకొచ్చినవని తెలిపింది. ఇకపై ఎక్కువ కాలం అమెరికాలో ఉండాలనుకునే విద్యార్థులు బయోమెట్రిక్ వెరిఫికేషన్, బ్యాక్‌గ్రౌండ్ చెక్, మోసాల నిర్ధారణ వంటి అదనపు పరిశీలనలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అమెరికాలో ప్రస్తుతం అమల్లో ఉన్న పాత విధానంలో ఉన్న విద్యార్థులకూ ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని, నిబంధనలు అమల్లోకి వచ్చిన తేదీ నుంచి గరిష్టంగా నాలుగేళ్ల వరకు మాత్రమే వారి నివాస అనుమతి ఉంటుందని DHS వెల్లడించింది.
ఓపెన్ డోర్స్ 2025 నివేదిక ప్రకారం, 2024–25 విద్యా సంవత్సరంలో అమెరికాలో 3,63,019 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరు అమెరికాలోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు 31 శాతం వాటాను కలిగి ఉన్నారు. దీంతో ఈ కొత్త నిర్ణయం భారతీయ విద్యార్థులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
అయితే అమెరికా విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు ఈ నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొత్త విధానం వల్ల పరిపాలనా భారం పెరగడంతో పాటు విదేశీ విద్యార్థుల్లో అనిశ్చితి పెరిగి, అమెరికా ఉన్నత విద్యకు ఆకర్షణ తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నాయి.




