Ukraine: ఉక్రెయిన్‌లో పెరుగుతున్న భయం...ఆర్మీలో చేరేందుకు నిరాకరిస్తున్న యువత
ఉక్రెయిన్ ప్రజల్లో రోజు రోజుకు భయం పెరిగిపోతున్నది. ప్రజలను అధికారులు బలవంతంగా ఆర్మీలో చేర్చుకొని ఫ్రంట్‌లైనర్‌గా మారుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Ukraine: రష్యా సరిహద్దుల్లో తుపాకుల మోత కంటే ఉక్రెయిన్ వీధుల్లో స్వదేశీ యువత ఆక్రోశంతో రగిలిపోతున్నది. దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరాల్సిన పౌరులే, రిక్రూట్‌మెంట్ అధికారులపై తిరగబడుతుండటం ఇప్పుడు తీవ్ర అంతర్జాతీయ చర్చనీయాంశంగా మారింది. రష్యాతో యుద్ధం సుదీర్ఘంగా సాగుతున్న నేపథ్యంలో, ఉక్రెయిన్‌లో సైనిక బలగాల కొరత తీవ్రమైంది. దీంతో ఆర్మీ అధికారులు వీధుల్లో పౌరులను బలవంతంగా బస్సుల్లో ఎక్కించి రిక్రూట్ చేసే 'బసిఫికేషన్' సంస్కృతికి తెరదీశారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా అధికారులపై దాడులు పెరిగాయి. ఇప్పటివరకు రిక్రూట్‌మెంట్ సైనికులపై 600 లకి పైగా భౌతిక దాడులు జరగగా, గతేడాది అధికారుల వేధింపులపై పౌరుల నుండి 6,000కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. అంతర్జాతీయ విశ్లేషణల ప్రకారం, ఈ సైనిక బలవంతపు సమీకరణ ప్రక్రియ ఉక్రెయిన్ అంతర్గత భద్రతను తీవ్రంగా దెబ్బతీస్తోంది.
వీధుల్లో దాడులు ... బసిఫికేషన్ భయం
యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం లేదా గాయపడటంతో ఆర్మీలోకి కొత్త రిక్రూట్‌మెంట్లు కరువయ్యాయి. వీధుల్లో వెళ్లే యువతను బలవంతంగా బస్సుల్లోకి తోసి మిలిటరీ క్యాంపులకు తరలిస్తున్నారు. ఇటీవల ల్వీవ్ నగరంలో దాదాపు 200 మంది నిరసనకారులు రిక్రూట్‌మెంట్ అధికారుల వాహనాన్ని ధ్వంసం చేసి తిరగబడ్డారు.
ఆందోళనలో రక్షణ శాఖ
ఈ సైనిక సంక్షోభం వల్ల అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఇటీవల తన రక్షణ మంత్రి మైఖైలో ఫెడోరోవ్‌ను పదవి నుండి తొలగించాల్సి వచ్చింది. సరిహద్దుల్లో రష్యన్ డ్రోన్లు, మిస్సైళ్ల మధ్య ప్రాణాలు వదలడానికి ఎవరూ సిద్ధంగా లేరు. సైన్యానికి కావాల్సిన జీతాలు పెంచినా, ప్రాణభయం ముందు అవి పనిచేయడం లేదు అని యుద్ధంలో గాయపడిన మాజీ సైనికుడు వాసిల్ కృపిచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు రష్యా దాడులు, మరోవైపు స్వదేశంలో పెరుగుతున్న ప్రజా నిరసనల నడుమ ఉక్రెయిన్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సైనిక బలగాలను పెంచుకోవడం ఉక్రెయిన్‌కు ఎంత అవసరమో, పౌరుల విశ్వాసాన్ని కాపాడుకోవడం కూడా అంతే కీలకమని అంతర్జాతీయ వ్యూహకర్తలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంధికి దిగి వస్తే ప్రజల ప్రాణాలు కాపాడివారౌతారు. అలా కాకుండా పంతానికిపోయి ఇలానే ముందుకు సాగితే దశాబ్ధకాలమైనా సరే ఈ యుద్ధం ముగింపుదశకు చేరదు. సైనికులతో పాటు ఇటు ప్రజలు కూడా సమిధలుగా మారవలసి వస్తుంది.




